లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటివి చట్ట విరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం, లేదా ఆ ఆధారంగా గర్భస్రావం చేయించడం వంటి చర్యలు సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా ఆడ శిశువుల సంఖ్య తగ్గడానికి దారితీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్తోనే పనిచేయాలని, నిబంధనలను పూర్తిగా పాటించాలన్నారు. ఎక్కడైన లింగ నిర్ధారణ జరిగినట్టు గమనిస్తే పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100, ఎస్. బి 8712685257 కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆడపిల్లల సంరక్షణ, లింగ సమానత్వం కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.




