గాంధీలో వైద్యం వికటించి విద్యార్థిని మృతి
సికింద్రాబాద్, మే 23 (విజయక్రాంతి): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీఎస్సీ ఓటీ టెక్నీషియన్ రెండో సంవత్సరం విద్యార్థిని ఎం. పల్లవి గౌడ్ (19) శనివారం మృతి చెందింది. ఛాతీలో ఫైబ్రోఅడెనోమా సమస్యతో ఈ నెల 16న గాంధీ ఆస్పత్రి జనరల్ సర్జరీ విభాగంలో ఆమె చేరినట్లు వైద్యులు తెలిపారు.
వైద్యుల విడుదల చేసిన పత్రిక ప్రకటనలో శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదని, అవసరమైన అనుమతులు తీసుకుని ఈ నెల 19న శస్త్రచికిత్స నిర్వహించామని వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ విజయవంతంగానే పూర్తయిందని వెల్లడించారు. అయితే మే 20 ఉదయం డ్రెస్సింగ్ వద్ద స్వల్ప రంగు మార్పు గమనించిన వైద్యులు పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించి, అదే రోజు ఉదయం 11 గంటలకు మళ్లీ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు.
శరీరంలో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించి, రక్తస్రావ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వెంటిలేటర్ సపోర్ట్‌తో అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయామని శనివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా నర్సింగ్ విద్యార్థిని మృతి పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతిపై పూర్తిస్థాయి విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పల్లవిగౌడ్ మృతిపట్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పల్లవి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.






