అనుమతి లేని గ్లోబల్ మైండ్ పాఠశాలను సీజ్ చేయాలి
పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా
గ్లోబల్ మైండ్ పేరును తొలగించాలని ఆదేశాలు
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 24 ( విజయక్రాంతి ): భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అనుమతులు లేకుండా గ్లోబల్ మైండ్ పేరుమీద పాఠశాల నడిపిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఎదుట వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాతుకు ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు కొల్లోజు దిలీప్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను, విద్యాశాఖ అధికారులను మోసం చేస్తూ గుర్తింపు పొందిన పాఠశాల పేరు కాకుండా హైదరాబాదుకు చెందిన గ్లోబల్ మైండ్ పాఠశాల పేరు పెట్టి పాఠశాల నడిపించడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి విద్యాసంవత్సరం ప్రారంభం నాటి నుండి జీతాలు ఇవ్వకపోగా ఇటీవల టీచర్లు, అయమ్మలు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారని అన్నారు. నిరసన కార్యక్రమాలతో తరచూ పాఠశాల నడవక విద్యార్థులు నష్టపోతున్నారని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి దేవా నాయక్ స్పందించి అనుమతి ఉన్న పాఠశాల పేరును కాకుండా ఇతర పాఠశాల పేరు పెట్టుకొని నడిపిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, బీఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు.






