25 August, 2026 | 2:06 AM

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్

24-08-2026 09:52 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి చర్మం , గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ  నాగ బిక్షం, టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సమయంలో తాళ్లగొమ్మూరు గ్రామం అనిల్ అనే వ్యక్తీ  ఇంటి వద్ద, ఒక చిన్న బ్యాగ్‌తో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు గత సంవత్సరం వేసవి కాలంలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో పడిపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న చిరుతపులిని రాళ్లు, కర్రలు తో కొట్టి ,భాణాలు విసిరి చంపినట్లు తెలిపారు. అనంతరం దాని చర్మం, గోర్లను తొలగించి, చర్మాన్ని ఎండబెట్టి, గోర్లను భద్రపరిచి ఉంచినట్లు వెల్లడించారు.తరువాత చిరుతపులి చర్మం, గోర్లను విక్రయించి డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తుండగా సారపాకకు చెందిన చల్లా అనిల్ కుమార్ అనే వ్యక్తీ భూమిని కౌలుకు తీసుకునే వ్యవసాయం చేయుట కొరకు గమ్మలకోట గ్రామం,

చింతూరు మండలం కు చెందిన కుంజా భద్రయ్య వద్దకు రాగా అతనిని సంప్రదించినట్లు తెలిపారు. అనిల్ కుమార్ కొనుగోలుదారులను సంప్రదించి విక్రయానికి సహకరిస్తానని చెప్పడంతో, కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు,మడవి కన్నయ్య ముగ్గురు కలిసి చిరుతపులి చర్మం, గోర్లను ఒక చిన్న బ్యాగ్‌లో పెట్టుకుని తాళ్లగొమ్మూరులోని అనిల్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి చిరుతపులి చర్మం , 17 గోర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఎస్పీ రోహిత్ రాజు వివరాలను వెల్లడించారు. పట్టుబడిన ముద్దాయిల వివరాలీలా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగోమ్మూరు గ్రామానికి చెందిన చల్ల అనిల్ కుమార్, పోలవరం జిల్లా చింతూరు మండలం గమ్మలకోట గ్రామానికి చెందిన కుంజ భద్రయ్య, అదే జిల్లా, అదే మండలం, గ్రామానికి చెందిన కుంజ గంగరాజు, అదే ప్రాంతానికి చెందిన మడవి కన్నయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు.