17 April, 2026 | 2:15 AM

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్ విద్యార్థినులు

17-04-2026 12:13 AM

ఘట్ కేసర్, ఏప్రిల్  16 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి అంకుషాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాల మహేంద్ర హిల్స్ అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన బాలికలు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఈనెల 11, 12 తేదీలలో హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ కప్ అండర్-20 విభాగంలో విద్యార్థినులు పలు పతకాలు సాధించారు. ఈపోటీల్లో డి. సత్య (లాంగ్ జంప్, హై జంప్) విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది.

మల్లిక 1500 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, 5000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం గెలుచుకుంది. పి. చైతన్య 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. విజేతలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్నేహలత అభినందిస్తూ వారికి మెడల్స్ అందజేసి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కవిత, అథ్లెటిక్స్ కోచ్ బిక్షపతి, కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.