17 April, 2026 | 2:09 AM

మహిళల అక్షరాస్యత, ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

17-04-2026 12:15 AM

రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజ్

షాద్ నగర్, ఏప్రిల్ 16( విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజ్, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వారికి బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తోందిని, రాష్ట్రవ్యాప్తంగా 8,000 మహిళా సంఘ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని గుర్తుచేశారు.

అంతకుముందు సంక్షేమ పథకాల పై అధికారులు సమీక్ష చేశారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి నూతన పథకాలపై అవగాహన కల్పించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని కమిషనర్ సూచించారు. 

పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను వర్షాకాలం లోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలని ఆ దిశగా అందరూ పని చేయాలని అన్నారు.  ఇందిరమ్మ ఇళ్లు చాలా వరకు ఇప్పటికే పూర్తి కాగా మిగిలినవి చివరి దశలో ఉన్నాయని తెలిపారు. అతి త్వరలో మిగతా వాటిని కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సమస్యలు సర్పంచ్లు తన దృష్టికి తెచ్చిన వెంటనే స్పందిస్తున్నానని ఆయన వెల్లడించారు.  అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు, అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫాంలు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్, డిపిఓ సురేష్ మోహన్, పిడి డి.ఆర్.డి. ఏ శ్రీలత, డిసిపి శిరీష, ఆర్డీవో సరిత ఎంపీడీవో బన్సీలాల్, ఏసిపి లక్ష్మీనారాయణ, తాసిల్దార్ నాగయ్య, సర్పంచులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.