ప్రజా సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ దీపక్ తివారీ
కొడంగల్, ఏప్రిల్ 16(విజయక్రాంతి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే మండల సభ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం బొంరాస్ పేట్ మండలం రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన మండల సభ లో పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మండల సభల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల సభకు అధికారులతో కలిసి హాజరై 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారుల ద్వారా చదివి వినిపించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజాపాలన - ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని, ఈ పథకాల ప్రగతి వివరాలను ప్రజలకు వివరించి పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
మహిళల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు రాయితీ గ్యాస్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం,
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ వ్యాపార రంగాలలో ప్రోత్సాహం, అర్హత కలిగిన వారందరికీ వంద శాతం ప్రభుత్వ పథకాల అమలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్ పి సి ఇ ఓ సుధీర్ ,గ్రంథాలయ ఛైర్మెన్ రాజేశ్వర్ రెడ్డి, బొంరాస్ పేట్ తహసీల్దార్ పద్మావతి, ఎం పి డి ఓ వెంకన్న గౌడ్, సర్పంచ్ విరేశం , ఏం పి ఓ రవి ,జిల్లా అధికారులు పాల్గొన్నారు.






