18 May, 2026 | 7:03 PM

విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

18-05-2026 05:52 PM
  1. యోగ, వ్యాయామం మన జీవితంలో ఒక భాగం కావాలి.
  2. పిలుపునిచ్చిన అదనపు కలెక్టర్ నర్సింగరావు.
  3. ఘనంగా ప్రారంభమైన యూత్ వీక్ సెలబ్రేషన్స్. 
  4. మారథాన్, వాక్ థాన్,  హెరిటేజ్ వాక్ నిర్వహణ.

గద్వాల టౌన్ :  విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, యోగ, వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా యువజన, క్రీడల, టూరిజం శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూత్, టూరిజం వీక్ సెలబ్రేషన్స్ ను సోమవారం గద్వాల ఇండోర్ స్టేడియం వద్ద ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ నర్సింగరావు 5కే, 2కె మారథాన్, వాక్ థాన్,  హెరిటేజ్ వాక్ లను జెండా ఊపి ప్రారంభించారు.

పట్టణ ప్రధాన రహదారుల మీదుగా నిర్వహించిన ఈ వాక్ లో విద్యార్థులు, క్రీడాకారులు, యువత, వ్యాయామ ఉపాధ్యాయులు, పలువురు విశ్రాంత ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే వివిధ శాఖల ఆధ్వర్యంలో సంబంధిత వారోత్సవాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో యూత్ వీక్ సెలబ్రేషన్స్ ప్రధానమైనవని, వారం పాటు నిర్వహించే కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధికి  ప్రభుత్వం కృషి చేస్తుందని, వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మనిషి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. మన శరీరం నియంత్రణలో ఉండేందుకు యోగ, వ్యాయామాన్ని కూడా ప్రతిరోజు చేస్తుండాలని సూచించారు. పౌష్టికాహారం, తగినంత నిద్ర, మంచి అలవాట్లు కూడా మనిషి ప్రశాంత జీవనం గడపడానికి ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని, సెల్ ఫోన్స్ చూడడం తగ్గిస్తే మంచి పౌరులుగా ఎదగవచ్చన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డివైఎస్ఓ రామలింగేశ్వర గౌడ్, ఎస్ జిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.