సుబ్బులక్ష్మి పాట..నిర్మలమ్మ కన్నీళ్లు
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దివంగత ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాట విని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) భావోద్వేగానికి గురయ్యారు. బెంగళూరులో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఆమె సంగీత సేవలను గుర్తుచేసుకున్నారు. కర్ణాటక సంగీతంలో భక్తి భావానికి ప్రత్యేక స్థానం ఉందని, భిన్న భాషలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలను సంగీతం ఏకం చేస్తుందని పేర్కొన్నారు.
సుబ్బులక్ష్మి సంగీతంపై చూపిన అంకితభావం, వినయం, క్రమశిక్షణ, కఠోర శిక్షణ గురించి కూడా నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. ఆమె సాధించిన అపారమైన విజయాల వెనుక ఎన్నో ఏళ్ల కఠిన సాధన ఉందని తెలిపారు.
1916 సెప్టెంబరు 16న మధురైలో జన్మించిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 20వ శతాబ్దపు ప్రముఖ గాయనీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 1998లో భారతరత్న పురస్కారం అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా ఆమె నిలిచారు. అంతకుముందు 1974లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్న తొలి భారతీయ సంగీత కళాకారిణిగా రికార్డు సృష్టించారు.
1966లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సంగీత ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగానూ సుబ్బులక్ష్మి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2004 డిసెంబరు 11న చెన్నైలో 88 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు.
ఇదిలా ఉంటే.. సుబ్బులక్ష్మి జీవితకథ త్వరలో వెండితెరపైకి రానుంది. ‘MS - A Legacy On Screen’ పేరుతో తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.