9 April, 2026 | 5:19 AM

రైతులకన్నా విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ

30-08-2024 12:12 AM
  1. జాతీయ సగటు కన్నా 2 రెట్లు అధికం 
  2. ఏటా 13 వేల మంది స్టూడెంట్స్ సూసైడ్ 
  3. విద్యార్థినుల ఆత్మహత్యల్లో 7 శాతం పెరుగుదల 
  4. ఐసీ3 స్వచ్ఛంద సంస్థ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. జనాభా పెరుగుదల, దేశంలో సాధారణ ఆత్మహత్యలకు మించి విద్యార్థుల సూసైడ్స్ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. రైతుల కంటే విద్యార్థులే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది. (ఇంటర్నెట్ క్రైమ్ కంప్లెయింట్ సెంటర్) ఐసీ3 వార్షిక కాన్ఫరెన్స్, ఎక్స్‌పో 2024 సందర్భంగా స్టూడెంట్స్ సూసైడ్స్: యాన్ ఎపిడె మిక్ స్వీపింగ్ ఇండియా పేరుతో నివేదిక విడుద చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) నుంచి సేకరించిన డాటా ప్రకారం ఈ నివేదికను రూపొందించారు. 

ఏటా 13వేల మంది.. 

స్వచ్ఛందంగా నడిచే ఐసీ3 సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో మార్గదర్శక త్వం, శిక్షణ వనరులను అందిస్తుంది. పాఠశాల నిర్వాహకులు, టీచర్లు, కౌన్సిలర్లను బలోపేతం చేసేందుకు సలహాలు, సూచనలు ఇస్తుంది. గతేడాది విద్యార్థుల ఆత్మహత్యలపై ఐసీ3 తొలి నివేదికను విడుదల చేయగా.. దేశంలో ఏటా 13 వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఐసీ3 స్థాపించింది. గతేడాది నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. 

ఐసీ 3 అధ్యయనంలోని అంశాలు

  1. గత దశాబ్దంలో 0 మధ్య వయసు గల వ్యక్తుల జనాభా 58.2 కోట్ల నుంచి 58.1 కోట్లకు తగ్గింది. అయితే, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య మాత్రం ఏటా 6,654 నుంచి 13,044కు పెరిగింది. 
  2. దేశంలో 15 ఏళ్ల వారి మధ్య ప్రతి ఏడుగురిలో ఒకరు నిరాశ, నిస్పృహ లక్షణాలతో తీవ్రమైన మానసిక అనారోగ్యా న్ని అనుభవిస్తున్నారని, ఇందులో 41% మంది తమకు ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మద్దతు కావాలని కోరుకున్న ట్లు యూనిసెఫ్ రిపోర్ట్ వెల్లడించింది. 
  3. 2022లో 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా 2021లో ఈ సంఖ్య 13,089గా ఉంది. కాగా మొత్తం ఆత్మహత్యల విషయానికి వస్తే 1.64 లక్షల నుంచి 1.7 లక్షలకు (4.2 శాతం పెరుగుదల) పెరిగింది. 
  4. ఏటా దేశంలో ఆత్మహత్యలు 2 శాతం పెరుగుతుండగా.. విద్యార్థుల సూసైడ్స్ పెరుగుదల 4 శాతంగా ఉంది. అంటే జాతీయ సాధారణ రేటుకు రెండింతలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు పెద్దగా కనిపించకపోయినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
  5. 2022లో విద్యార్థుల మొత్తం సూసైడ్స్‌లో బాలలు లేదా యువకులవి 53 శాతంగా ఉన్నాయి. 2021 మధ్య ఇవి 6 శాతం తగ్గగా, విద్యార్థినుల ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయి. 
  6. విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. కొంతకాలంగా నీట్ అభ్యర్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలిచిన రాజస్థాన్ మాత్రం 571 ఆత్మహత్యలతో 10వ స్థానంలో ఉంది.