9 April, 2026 | 7:06 AM

త్వరలో భారత్ డోజో యాత్ర

30-08-2024 12:07 AM
  1. యుద్ధ కళలను ప్రచారం చేయటమే లక్ష్యం 
  2. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 29: లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశం నాలుగు మూలలను కలుపుతూ భారత్ జోడోయాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తాజాగా భారత్ డోజో యాత్రను ప్రకటించారు. త్వరలో భారత్ డోజో యాత్ర నిర్వహించనున్నట్టు గురువారం ప్రకటించారు. డోజో అనేవి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొనే శిబిరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తాను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ‘జోడో యాత్ర సమయంలో మేం వేల కిలోమీటర్లు ప్రయాణించాం. మా శిబిరాల వద్ద రోజూ జివూ జిట్సు (బ్రెజిల్‌కు చెందిన యుద్ధ కళ)ను ప్రాక్టీస్ చేసేవాళ్లం. శారీరక ద్రుఢత్వానికి మేం చేపట్టిన ఈ సాధన త్వరలోనే చాలామందికి అలవాటైంది. మెడిటేషన్, జివూ జిట్సు, అకిడో వంటివాటిని యువతకు పరిచయం చేయటమే లక్ష్యంగా శిబిరాలు నిర్వహించాం. ఘర్షణలను కూడా అహింసాయుతంగా పరిష్కరించే విధానాలను పరిచయం చేశాం. దయ, సురక్షితమైన సమాజం కోసం సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం’ అని ట్వీట్ చేశారు. అయితే, ఈ భారత్ డోజో యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? అందులో ఏం చేస్తారన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.