01-11-2025 06:30:28 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పట్టణ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందులో భాగంగా పట్టణ అభివృద్ధికి గాను మరో రూ.15 కోట్లు మంజూరు చేయించినట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ జారీ చేసిన జీవో(566) కాపీలను శనివారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సుల్తానాబాద్ పట్టణంపై సవతి తల్లి ప్రేమ చూపించారని అన్నారు. అభివృద్ధిలో పట్టణం ఎంతో వెనుకబడిపోయిందన్నారు.
తాను పక్కనే ఉన్న శివపల్లి గ్రామంలో పుట్టినప్పటికీ, సుల్తానాబాద్ ప్రజల్లో ఒకరిగా ఇక్కడే పెరిగి చదువుకున్నానని చెప్పారు. అందుకే పట్టణం రుణం తీర్చుకునేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. రూ. 15 కోట్లను పట్టణంలో ఇంటర్నల్ రోడ్లు, జెంక్షన్ లు,డ్రైనేజీలు, కల్వర్టులు, విలీన గ్రామాల అభివృద్ధికి వెచ్చించనున్నట్టు చెప్పారు. కోరగానే నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు తనకు అండగా నిలవాలని, మరిన్ని నిధులను సమీకరించి అభివృద్ధి పనులు చేపడతానని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు.