ఎమ్మెల్యే అరెకపూడికి సమన్లు
- సాహితీ ఇన్ఫ్రా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
- రూ.842 కోట్ల స్కాం జరిగినట్లు గుర్తింపు
- రూ.2.1 కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై ఆరా
- ఈనెల 27న విచారణకు రావాలని ఆదేశం
- రాజకీయ వర్గాల్లో కలకలం
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ‘సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Sahiti Infratec Ventures India Private Limited)’ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Arekapudi Gandhi)కి సమన్లు జారీ చేసింది. సాహితీ ఇన్ఫ్రా సంస్థ నుంచి ఆయన బ్యాంకు ఖాతాలకు సుమారు రూ.2.1 కోట్లు మళ్లినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఈ వ్యవహారం వెనుక ఏవైనా వ్యాపార లావాదేవీలున్నా యా? నిధుల బదిలీకి కారణాలు? అందుకు ఏమైనా ఒప్పందాలు, పత్రాలు ఉన్నాయా? అనే కోణంలో ఈడీ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.248 కోట్ల నుంచి రూ.842 కోట్లకు స్కాం
సాహితీ ఇన్ఫ్రా కేసులో తొలుత రూ.248 కోట్ల మేర మోసం జరిగినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈడీ దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం విలువ రూ.842 కోట్లకు చేరినట్లు ఈడీ గుర్తించింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్లాట్లు, విల్లాలు విక్రయిస్తామని నమ్మబలికి కొనుగోలుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని, ఆ తర్వాత ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సంస్థ యాజమాన్యం మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రూ.173 కోట్ల ఆస్తులు అటాచ్, 56 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
నిందితులు బినామీ పేర్లతో కొనుగోలు చేసిన రూ.173 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో మొదటి విడతలో రూ.161.50 కోట్లు, రెండో విడతలో రూ.12.6 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులున్నట్లు అధి కారులు వెల్లడించారు. అలాగే అక్రమ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన 56 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. 2018 మధ్య కాలం లోనే రూ.50 కోట్లు నగదు రూపంలో వసూలు చేశారని, రూ.126 కోట్లు సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు తమ సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది.
2024లోనే సంస్థ ఎండీ అరెస్టు
సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు 2024 సెప్టెంబ ర్లోనే అరెస్టు చేశారు. అంతే కాకుండా ఈ సంస్థ ప్రకటనల్లో నటించిన ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబును కూడా ఈడీ గతంలో సాక్షిగా విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైదరాబాద్లోని ఎం ఎస్ జే కోర్టులో ఇప్పటికే ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను (చార్జిషీట్) దాఖలు చేసింది. తాజాగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి సమన్లు జారీ కావడంతో రాజకీయంగా కలకలం రేపింది.