ప్రజా యోధుడు సుందరయ్య
నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి :
భారత రాజకీయ చరిత్రలో సిద్ధాంతాలకు, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన అరుదైన నాయకుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. అధికారం కోసం కాకుండా అట్టడుగు ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. రైతు, కూలీ, పేద ప్రజల బాధలను తన బాధలుగా భావించి ఉద్యమాలకు నాయకత్వం వహించిన విప్లవకారుడు సుందరయ్య.
సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత ఘట్టాలను స్మరించుకోవడం అంటే ఒక మహోన్నత ప్రజానాయకుడి త్యాగ గాథను గుర్తుచేసుకోవడమే. పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1న నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్ననాటి నుంచే సామాజిక అసమానతలు ఆయన మనసును కలిచివేశాయి. గ్రామాల్లో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న దోపిడీ ఆలోచింపజేసింది.
విద్యార్థి దశలోనే జాతీయోద్యమ ప్రభావం ఆయనపై పడింది. మహాత్మాగాంధీ పిలుపునకు స్పందించి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. అయితే తర్వాత సామాజిక సమానత్వం సాధించాలంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం సరిపోదని, ఆర్థిక-, సామాజిక మార్పులు అవసరమని భావించి కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. 1930లలో కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా పనిచేయడం ప్రారంభించిన సుందరయ్య, రైతు-కార్మిక సమస్యలపై దృష్టి పెట్టారు.
అప్పటి సామంత వ్యవస్థ, జమీందారీ దోపిడీ, వెట్టిచాకిరి వంటి అన్యాయాలపై తీవ్రంగా స్పందించారు. సుందరయ్య జీవితంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. నిజాం పాలనలో దోపిడీ, దురాగతాలు, సామంతుల అకృత్యాలకు వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేసిన ఉద్యమానికి ఆయన ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరు. తెలంగాణలో జరిగిన రైతాంగ పోరాటం రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు; అది సామాజిక విముక్తి యుద్ధం.
గ్రామాల్లో ప్రజా కమిటీల ఏర్పాటు, భూముల పంపిణీ, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలు ఆ ఉద్యమాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ పోరాటంలో ఆయన ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ప్రజల కోసం పోరాటాన్ని ఆపలేదు. స్వాతంత్య్రం తర్వాత రాజ్యసభ సభ్యుడిగా రైతు, పేదల సమస్యలు, భూ సంస్కరణల అవసరం గురించి గళమెత్తారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో విభజన జరిగినప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) స్థాపనలో సుందరయ్య కీలకపాత్ర పోషించారు.
ఆ పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, ప్రజా అనుబంధం పెరగడానికి కృషిచేశారు. నాయకత్వం అంటే ప్రజల ముందు నడవడం కాదు, ప్రజలతో కలిసి నడవడమనేది ఆయన నమ్మకం. కుటుంబ జీవితం కంటే ఉద్యమానికే ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. ఆయన భార్య లీల సుందరయ్య కూడా ఉద్యమాలకు అండగా నిలిచారు. నేటి రాజకీయాల్లో కనిపించే ఆర్భాటం, వ్యక్తిగత ప్రచారం, అధికారం కోసం పోటీ ఇవేవీ ఆయనలో కనిపించలేదు.
అందుకే ఆయనను రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రతీకగా భావిస్తారు. సుందరయ్య ఉద్యమ నాయకుడే కాదు; గొప్ప ఆలోచనాపరుడు, గొప్ప రచయిత కూడా. తెలంగాణ సాయుధ పోరాటంపై పుచ్చలపల్లి సుందరయ్య రచనలు చారిత్రక పత్రాలుగా గుర్తింపు పొందాయి. రైతు సమస్యలు, భూ సంస్కరణలు, భారత రాజకీయాలపై ఆయన విశ్లేషణలు ఇప్పటికీ అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి.
నేటి సమాజంలో అసమానతలు, నిరుద్యోగం, రైతు సమస్యలు కొనసాగుతున్న తరుణంలో సుందరయ్య ఆలోచనలు మరింత ప్రాసంగికంగా కనిపిస్తున్నాయి. యువత రాజకీయాల్లోకి రావాలంటే ప్రజా బాధ్యత, సామాజిక స్పృహ అవసరమని మనకు సుందరయ్య జీవితం చెబుతోంది.
ప్రజా ఉద్యమాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలిచిన సుందరయ్య 1985 మే 19న మరణించినప్పటికీ, ఆయన ఆశయాలు ఇంకా సజీవం గానే ఉన్నాయి. పేదల పక్షాన నిలబడిన సుం దరయ్య పోరాటం భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆళవందార్ వేణుమాధవ్
8686051752






