21 May, 2026 | 2:41 AM

క్రీమీలేయర్‌తో సామాజిక అన్యాయం

19-05-2026 12:00 AM

ఇంద్రా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992) తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో సామాజిక న్యాయానికి సంబంధించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో ఒకటి. ఈ తీర్పు ద్వారా ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీలు) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు స్ప ష్టం చేసింది. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు ఈ తీర్పు రాజ్యాంగబద్ధమైన బలం ఇచ్చింది. అయితే ఇదే తీర్పులో సు ప్రీంకోర్టు మరో కీలకమైన భావనను ప్రవేశపెట్టింది. అదే సంపన్న వర్గాల సిద్ధాంతం లేదా క్రీమీలేయర్ సిద్ధాంతం. ఓబీసీల్లో ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా ఇప్పటి కే ఎదిగిపోయిన సంపన్న వర్గాలు రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందితే, అత్యంత వెనుకబడిన వర్గాలకు అవకాశాలు చేరవని కోర్టు ఈ సందర్భంగాఅభిప్రాయపడింది. అందుకే ఓబీసీల్లోని ఉన్నత వర్గాలను రిజర్వేషన్ల పరి ధి నుంచి తొలగించాలని కోర్టు సూచించిం ది. ఈ భావనను క్రీమీలేయర్ అని పిలిచారు.

క్రీమీలేయర్ భావన రిజర్వేషన్ వ్యవస్థలో ఒక వివాదాస్పద అంశం. ఒకవైపు ఇది ఓబీసీలకు అవకాశాలు చేరాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన విధానమని వాదిస్తే, మరోవైపు బీసీల ప్రాతినిధ్యాన్ని పరిమితం చేసే ఒక పరిపాలనా ఆయుధంగా మారిందని విమర్శలు ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఆ సమయంలో ఇంకా అమలులోకి కూడా రాలేదన్న విషయాన్ని ఈ సందర్భం గా మనం ఇక్కడ గమనించాలి. కానీ, రిజర్వేషన్లు అమలుకాకముందే వాటిపై పరిమి తులు విధించడం ప్రారంభమైంది. దీనివల్ల బీసీ సమాజంలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమైంది. అదేమిటంటే రిజర్వేషన్ల ద్వా రా సామాజిక న్యాయం అందించాలనే ఉద్దేశమా? లేక వాటిని పరిమితం చేయాలనే ప్రయత్నమా? అనే చర్చ మొదలైంది.

మరోవైపు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అనేవి ప్రధానంగా సామాజికం గా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కల్పించబడిన రాజ్యాంగ పరిరక్ష ణలు. ముఖ్యంగా ఆర్టికల్ 15(4), 16(4)ల లో సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనమే ప్రమాణంగా పేర్కొన్నారు. క్రీమీలే యర్ సిద్ధాంతం ద్వారా ఆర్థిక ప్రమాణాలను కూడా రిజర్వేషన్ వ్యవస్థలో కలపడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించారని అనేక ఓబీసీ వర్గాలు అభిప్రాయప డుతున్నాయి. వారి వాదన ప్రకారం ఆర్థికంగా వృద్ధి చెందారనేది తాత్కాలిక పరిస్థితి కావచ్చు, కానీ కుల ఆధారిత సామాజిక వెనుకబాటుతనం శతాబ్దాలుగా కొనసాగుతున్న నిర్మాణాత్మక అసమానత. కాబట్టి రిజర్వేషన్ల అసలు ఉద్దేశం కేవలం ఆర్థిక సహాయం కాదు, చారిత్రాత్మకంగా అణచివేతకు గురైన వర్గాలకు ప్రాతినిధ్యం, అవకా శాలు, గౌరవం కల్పించడం. అందువల్ల సామాజిక న్యాయం అనే రాజ్యాంగ మూలసూత్రాన్ని పక్కనబెట్టి కేవలం ఆర్థిక ప్రమా ణాలను ముందుకుతేవడం ద్వారా రిజర్వేషన్ వ్యవస్థ అసలు తాత్వికత బలహీన పడుతోందని ఓబీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఓబీసీ రిజర్వేషన్ల విషయానికివస్తే, కోర్టు లు ప్రభుత్వాలు కొత్త కొత్త భావనలు కనిపెడుతున్నాయి. అందులో కొన్ని ఈ విధంగా ఉన్నాయి: మొదట్లో కులాల ఆధారంగా వెనుకబడిన తరగతులను ఎలా నిర్ణయిస్తారు? అనే ప్రశ్నను లేవనెత్తుతూ అనేక సందర్భాల్లో బీసీ రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేశాయి. ఈ కేసులో కులం కూడా ఒక వర్గమే అని తీర్పు ఇచ్చి ఒక సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ, కొన్ని కొత్త సమస్యలు సృష్టించబడ్డాయి. మొదటిది, ఈ తీర్పులో రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పటికీ 50% సీలింగ్ దాటకూడదనే నిబంధన; ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమ లు చేయాలని చెప్తూ, ఓబీసీలకు మాత్రం 50 శాతంలో మిగిలింది అమలు చేయాలని తీర్పు ఇవ్వడమైనది.

ఈ విధంగా ఓబీసీ వర్గాల రిజర్వేషన్లపై కోర్టు పరిమితులు విధించింది. రెండవది, క్రీమీలేయర్ అంటే సంపన్న వర్గాలు అని చెప్పి ఓబీసీ వర్గాలను రిజర్వేషన్లకు దూరం చేయటం. అలాగే ప్ర భుత్వాలు బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకపోవటం. 77వ రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు కానీ, అందులో బీసీలకు అవకాసం కల్పించలేదు. రాజ్యాంగబద్ధంగా ఉ న్న అవకాశాల అమలులో ప్రతి దశలోనూ కోర్టులు, ఆధిపత్య కుల ప్రభుత్వాలు అవరోధాలు కల్పిస్తున్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

క్రీమీలేయర్ భావన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలను పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన అం శాలు కనిపిస్తాయి. మొదటిది, రిజర్వేషన్ల ప్ర యోజనాలు కొద్దిమంది ఆధిపత్య వర్గాలకే 

పరిమితం కాకుండా, నిజంగా వెనుకబడిన కుటుంబాలకు చేరాలనే ఉద్దేశం. రెండవది, ఓబీసీ వర్గాల అంతర్గత అసమానతలను తగ్గించడం. మూడవది, సామాజిక న్యాయాన్ని సమానంగా అమలు చేయడం. నాలుగవది, తరతరాలుగా రిజర్వేషన్ల ప్ర యోజనాలు పొందుతున్న కుటుంబాల ఆధిపత్యాన్ని తగ్గించడం. ఐదవది, అత్యంత వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు విస్తరించడం. 

అయితే ఈ సిద్ధాంతం అమలులో అనేక సమస్యలు కూడా బయటపడ్డాయి. ము ఖ్యంగా బీసీలకు పూర్తిస్థాయి ప్రాతినిధ్యం ఇప్పటికీ అందలేదు. ఇప్పటికీ కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు పూర్తిస్థాయి ప్రాతిని ధ్యం దక్కలేదనే విషయం అధికారిక గణాంకాల ద్వారానే స్పష్టమవుతోంది. కేంద్రప్ర భుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2024 నాటికి కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో కేటగిరీ- ఏ పోస్టు ల్లో బీసీల ప్రాతినిధ్యం కేవలం 19.14% (1,19,178 ఉద్యోగాల్లో బీసీలు 22,807 మా త్రమే); కేటగిరీ ‘బీ’లో 21.95% (3,64,307 ఉద్యోగాల్లో 79,952 మాత్రమే); కేటగిరీ-‘సీ’లో 27.29% (27,27,930 ఉద్యోగాల్లో 7,44,527); కేటగిరీ ‘-డీ’లో 21.15% (సఫా యి కర్మచారి 40,737 ఉద్యోగాల్లో 8,614) మాత్రమే ఉంది.

మొత్తం మీద వీరి ప్రాతినిధ్యం 32,52,152 ఉద్యోగాల్లో 8,55,900 మాత్రమే (26.32%). అంటే 1993 నుంచి ఈ రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ, 33 సంవత్సరాలు గడిచినా బీసీలు ఇంకా చట్టపరమైన 27% ప్రాతినిధ్యాన్ని కూడా చేరు కోలేకపోయారు. మరి మెరిట్‌లో సెలెక్ట్ అ యినవారు ఇందులో ఎంత మంది ఉన్నారో తెలియదు. దీని అర్థం రిజర్వేషన్ల అమలులో ఎన్ని రకాల పరిపాలనా, న్యాయ, విధానపరమైన ఆటంకాలు సృష్టించబడుతున్నాయో బీసీ సమాజం లోతుగా అర్థం చేసుకోవాలి.

క్రీమీలేయర్ నిర్ణయించే విధానంపై కేం ద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను రూ పొందించింది. కేంద్రప్రభుత్వ మెమో 36012/22/93 తేదీ 08 ద్వా రా మొదటి మార్గదర్శకాలు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 3047/పి/94-4 తేదీ 28 జీవో 3 తేదీ 4 ఏప్రిల్ 2006, బీసీ డిపార్ట్‌మెంట్ ద్వారా కేంద్రప్రభుత్వ నిబంధనలను ఆమోదించి అమలు చేస్తుంది. జీవో 26 తేదీ 9 డిసెంబర్ 2013 ద్వారా నిర్వచనం, ప్రమాణాలు సూచించారు.

2004 మార్చి 14న కేంద్ర ప్రభుత్వం ఒక వివరణాత్మక మెమో జారీచేసింది. ఆ మెమో ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల క్రీమీలేయర్‌ను జీతభత్యాల ఆధారంగా కూడా నిర్ణయించవచ్చని పేర్కొంది. అయితే ఈ విధానాన్ని సవాలు చేస్తూ పలు కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఇటీవల ‘రోహిత్ నాథ్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు 2026 మార్చి 13న కీలక తీర్పు ఇచ్చింది. కేంద్రప్రభుత్వం జారీచేసిన కొన్ని వివరణాత్మక సర్క్యులర్లు చట్టబద్ధంగా లేదని కోర్టు కొట్టివేసింది. దీని ద్వారా క్రీమీలేయర్ నిర్ణయంలో ప్రభుత్వాలు అనుసరించే ప్ర మాణాలు కూడా న్యాయ సమీక్షకు లోబడతాయని మరోసారి స్పష్టమైంది. 

అలాగే ‘ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (2006) కేసులో సు ప్రీంకోర్టు రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు అవసరమని పేర్కొంది. ‘జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా’ (2018) కేసులో కూడా క్రీమీ లేయర్ భావనను మరింత విస్తరించే ప్రయ త్నం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల ప్రమోషన్ రిజర్వేషన్ల విషయంలో కూడా క్రీమీలేయర్ వర్తింపుపై చర్చ జరిగింది. అయితే ఇది ఇంకా పెద్ద రాజ్యాంగ, సామాజిక చర్చకు దారితీస్తున్న అంశం. 2004లో ‘స్టేట్ అఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్’ కేసులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన పరిశీలన చేసింది.

ఎస్సీ, ఎస్టీలలో అంతర్గత అస మానతలు ఉన్నాయని, కొంతమంది వర్గాలే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అవసరమైతే రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల లోపల ఉపవర్గీకరణ చేయవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశం ఇవ్వలేదు. వెంటనే కేంద్రప్రభుత్వం తాము ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ అమలుచేయబోమని తేల్చిచెప్పింది.

ప్రస్తుతం క్రీమీలేయర్ గుర్తింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ము ఖ్యమైన నియమాలు ఇవి: 1. రాజ్యాంగ పోస్ట్‌లలో ఉన్నవారు భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి కుటుంబాలు ఆటోమేటిక్‌గా క్రీమీలేయర్ కింద వస్తారు. 2. సివిల్ ఉద్యోగులు - ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఆల్ ఇండి యా సర్వీసుల అధికారులు, కేంద్ర ప్రభుత్వ కేటగిరీ- ఏ/ గ్రూప్ I డైరెక్ట్‌గా నియమితులైన ఉద్యోగుల కుటుంబాలు క్రీమీలేయర్‌గా పరిగణించబడతాయి. 3. తల్లిదండ్రులు ఇరువు రు గ్రూప్ ఉద్యోగులుగా డైరెర్ట్‌గా ఎంపి కై, ఏ ఒక్కరైనా 40 సంవత్సరాలలోపు కేటగిరీ ఏ ఉద్యోగాలకు ప్రమోట్ అయినప్పుడు 4. సంపద లేదా ఆస్తి పరీక్ష - ప్రస్తుతం సంవత్సరానికి రూ.8 లక్షలకు పైబడిన ఆదాయం ఉన్న కుటుంబాలను క్రీమీలేయర్‌గా గుర్తిస్తున్నారు.

అయితే ఇందులో ఉద్యోగ వేతనం, వ్యవసాయ ఆదాయాన్ని నేరుగా కలపకూడదు. ఇతర వనరుల నుంచి వచ్చే ఆదా యాన్ని మాత్ర మే ప్రధానంగా పరిగణిస్తారు. 5. డాక్టర్లు, ఇంజినీర్లు, చార్టర్డ్ అకౌం టెంట్లు వంటి ప్రొఫెషనల్స్ వరుసగా మూ డు సంవత్సరాలు రూ.8 లక్షలకు పైబడిన ఆదాయం పొందితే క్రీమీలేయర్ కిందికి వస్తారు. 6. వ్యవసాయ భూముల విషయంలో కూడా ప్రత్యేక ప్రమాణాలు ఉన్నా యి. సాగునీటి వసతి ఉన్న పెద్ద భూస్వామ్య కుటుంబాలను క్రీమీలేయర్‌గా గుర్తించవచ్చు. వీటి గురించి పైన తెల్పిన జీవోలలో పూర్తి వివరణలు ఉన్నాయి.

ఈ నిబంధనల అమలులో సాధారణ బీసీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాము క్రీమీలేయర్ కిందికి రావడం లేదని నిరూపించడానికి అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చాలామంది అధికారులకు కూడా ఈ నిబంధనలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు/ నష్టపోతున్నారు.

దేశవ్యాప్తంగా ఒకే రకంగా రూ.8 లక్షల ఆదాయ పరిమితి పెట్టటం న్యాయపరంగా, వాస్తవికంగా సరికాదనే ఓబీసీ సం ఘాల అభిప్రాయం బలంగా ఉంది. జీవన ఖర్చులు, జీవన ప్రమాణాలు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, నగర, -గ్రామాల వ్యయ వ్యత్యాసాలు వేరేవే. అందువల్ల రాష్ట్రీయ స్థాయిలో తలసరి ఆదాయం ఆధారంగా రాష్ట్రాలకు వివిధ సీలింగ్స్ నోటిఫై చేయించడం సముచితం. ఇది అవసరమైన వనరులను సరిగ్గా గుర్తించి రిజర్వేషన్ హక్కుల సరైన ప్రయోజనాన్ని నిర్ధారిస్తుంది.

ఇంకా ఒక ముఖ్యమైన విమర్శ ఏమిటంటే, క్రీమీలేయర్ నిర్ణయం ప్రధానంగా ఆర్థిక ప్రమాణాల 

ఆధారంగా జరుగుతోంది. కానీ, భారతదేశంలో కుల వివక్ష కేవలం ఆర్థిక అంశం కాదు; అది సామాజిక, సాంస్కృతిక, చారిత్రాత్మక అంశం కూడా. ఒక బీసీ కుటుంబం ఆర్థికంగా కొంత ఎదిగినా, కుల వివక్ష పూర్తిగా తొలగిపోదనే వాదన బలంగా వినిపిస్తోంది. అందువల్ల క్రీమీలేయర్‌ను కేవలం ఆదాయ ప్రమాణంతో నిర్ణయించడం సరైన సామాజిక న్యాయం కాదని చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు.

 మొత్తానికి క్రీమీలేయర్ భావన భారత రిజర్వేషన్ వ్యవస్థలో అత్యంత వివాదాస్పద అంశంగా మారింది. ఒకవైపు ఇది అత్యంత వెనుకబడిన వర్గాలకు అవకాశాలు చేరాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన విధానమని వాది స్తే, మరోవైపు ఇది బీసీల ప్రాతినిధ్యాన్ని పరిమితం చేసే ఒక పరిపాలనా ఆయుధంగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో పూర్తిస్థాయి 27% ప్రాతినిధ్యం సాధించని పరిస్థితి ఉం ది. మరి ఈ పరిస్థితుల్లో క్రీమీలేయర్ నిబంధనలు కొనసాగించడమంటే బీసీలకు అన్యాయం చేసినట్టేనని బీసీ సంఘాలు భావిస్తున్నాయి.

ఇప్పుడు క్రీమీలేయర్‌పై మరింత విస్తృత చర్చ, పునర్విమర్శ అవసరం ఉందని అనేక సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. భారత రాజ్యాంగం చెప్పిన సామాజిక న్యాయం ని జంగా అమలు కావాలంటే, కేవలం పరిమితులు విధించడం కాకుండా వెనుకబడిన వ ర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, సమాజం కలిసి ముందుకురావాల్సిన అవసరం ఉంది.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్