ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రమేయం ఉన్న 2015 ఓటుకు నగదు కుంభకోణం కేసులో విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు విచారించే ఏసీబీ(హోంశాఖ) సీఎం పరిధిలో ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కేసు ట్రయల్ పై పూర్తి అనుమానాలున్నాయని పిటిషనర్ లాయర్ తెలిపారు. అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్లేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్ లో వైఖరి మారిందని జగదీశ్ రెడ్డి న్యాయవాది వెల్లడించారు. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఏర్పాటు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తాం.. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.






