11 June, 2026 | 1:04 AM

రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ

11-06-2026 12:03 AM

మేడ్చల్, జూన్ 10(విజయ క్రాంతి): కొల్తూర్లోని వెంకటరమణ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మిల్లులో కొనసాగుతున్న ధాన్యం దిగుమతి, అన్లోడింగ్ , నిల్వ ప్రక్రియలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వాహనాలను ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన అన్లోడ్ చేయించాలని మిల్లర్ కు సూచించారు. వాహనాలు మిల్లుల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

అలాగే అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన మేరకు హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.మిల్లులో ధాన్యం నిల్వ పరిస్థితులు, హమాలీల అందుబాటు, వాహనాల కదలికలను అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని మిల్లర్లకు స్పష్టం చేసారు. అనంతరం అదనపు కలెక్టర్ బొమ్మరాశిపేట లోని గోడౌన్ను పరిశీలించారు.

గోడౌన్కు ఇప్పటివరకు దిగుమతి అయిన ధాన్యం పరిమాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, కొనుగోలు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన అదనపు గోడౌన్లను వెంటనే గుర్తించి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.