నాణ్యమైన బోధనతో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ఐటీడీఏ పీవో మకరందు
ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణను ఆకస్మికంగా సందర్శన
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆకస్మికంగా సందర్శించారు.శిక్షణ జరుగుతున్న ప్రతి సబ్జెక్టు తరగతిని పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులతో కలిసి కొంతసేపు కూర్చొని శిక్షణా విధానాన్ని గమనించారు. శిక్షకులు బోధిస్తున్న అంశాలను పరిశీలిస్తూ, ఉపాధ్యాయులతో పరస్పరం చర్చించి బోధనలో నాణ్యత పెంపు, వినూత్న బోధనా పద్ధతుల అమలు, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలపై పలు సూచనలు చేశారు.
శిక్షణను కేవలం హాజరు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఉపాధ్యాయుడి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశంగా భావించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా విధానాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, పీఎంఆర్సీ ఏసీఏఎంఓ పూర్క ఉద్ధవ్, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, జిల్లా క్రీడల అధికారి మాడావి శేఖు, కోర్సు డైరెక్టర్ కోడెం రవీందర్, ప్రధానోపాధ్యాయులు లింభారావు, రిసోర్స్ పర్సన్లు, శిక్షణ సమన్వయకర్తలు, వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






