5 June, 2026 | 12:45 AM

విద్యార్థుల త్యాగాలకు గుర్తింపు దక్కేనా?

05-06-2026 12:00 AM

స్వరాష్ట్ర సాధన కోసం సకలజను లు భాగస్వాములైన మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఖ్యాతిగాంచిం ది. వందలాది విద్యార్థి, యువకుల ప్రాణ త్యాగ ఫలితమే నేటి తెలంగాణ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తమ విలువైన కాలాన్ని, భవిష్యత్తును కోల్పోయి స్వరాష్ట్ర కలను సాకారం చేయడంలో కీలకపాత్ర పోసించినది కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థి ఉద్యమకారులే.

విద్యార్థులు తమ ప్రాంత అస్తిత్వ మనుగడ కోసం సాగించిన గొప్ప ఉద్యమమే తెలంగా ణ పోరాటం. నూరేళ్ల భవిష్యత్తును, స్వయం పాలన కోసం అంకితం చేస్తూ, స్వరాష్ట్ర పోరులో ‘జై తెలంగాణ’ నినాదాన్ని ప్రాణవాయువుగా భావించి, సీమాంధ్ర ఆధిపత్యా నికి ఎదురు నిలబడి గెలిచిన తెలంగాణ విద్యార్థి, యువకుల త్యాగాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగానే ఉద్యమకారుల త్యాగాలను గుర్తించడం కోసం ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, మంత్రివర్యులు పొన్నం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి వారిని సభ్యులుగా నియమిస్తూ జీవో నెం బర్ 679ని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన యూనివర్సిటీ విద్యార్థుల పాత్రను, ఎదుర్కొ న్న నిర్బంధాన్ని, రేఖామాత్రంగా గుర్తుచేసుకోవడం బాధ్యతగా భావిస్తున్నాం.  

ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం లో యూనివర్సిటీ విద్యార్థులు పోషించిన పాత్ర అద్భుతమైనది. యూనివర్సిటీల చుట్టూ పారా మిలిటరీ బలగాలను కాపలా పెట్టినా గుండె ధైర్యం, తెగువతో కూడిన సాహసోపేతమైన ఆందోళనలతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నివ్వెర పోయేలా చేసిన ఉద్యమ ఘట్టాలు చరిత్రలో నిలిచిపోతాయి. హాస్టళ్లు మూసివేసినా, ఆకలిదప్పులైనా ఆత్మగౌరమే తమకు ముఖ్యమంటూ వీపులపై లాఠీలు స్వైరవిహారం చేస్తున్నా, పోలీస్ కాల్పులు చేస్తున్నా ఉద్యమకారులు వెనకడుగు వేయలేదు. ఉద్యమం స్తబ్దంగా ఉన్న ప్రతి సందర్భంలో వరంగల్, ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాన్ని నిలబెట్టారు. ఈ నేపథ్యానికి  ఓరు గల్లు పోరాట వారసత్వమే పునాదిగా నిలిచిందని చెప్పవచ్చు.

నాటి నుంచి నేటి వరకు అస్తిత్వ, ధిక్కార స్వరానికి ప్రతీకలైన పోతన, పాల్కూర్కి సోమన్న, సమ్మక్క, సారక్క, సర్వాయి పాప న్న, బందగి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐల మ్మ నుంచి కాళోజీ, జయశంకర్, బియ్యాల జనార్దన్ రావు, బుర్ర రాములు, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ వరకు అనేకమంది ఓరుగల్లు బిడ్డలే. ఈ వారసత్వం వెలుగులోనే తెలంగాణ పోరులో ధిక్కార స్వభావాన్ని పుణికిపుచ్చుకున్న కేయూ విద్యార్థులు చేసిన పోరాటం అజరామరం. ప్రతి ఉద్యమ కీలక ఘట్టాల్లో కేయూ విద్యార్థులు చూపించిన తెగువ వీరోచితమైనది. తెలంగాణ ఉద్యమంలో రాయినిగూడెం, మానుకోట, మిలియన్ మార్చ్ సంఘటనలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశాయి.

రచ్చబండ కార్యక్రమం పేరిట నేటి ములుగు జిల్లా రాయినిగూడేనికి సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరూపించడానికి నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వస్తే, 5000 మంది పోలీసు బలగాల నిర్బంధాన్ని తట్టుకొని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కృష్ణలత, కవిత, సావిత్రి, జ్యోతి (ఆ నలుగురు) ముఖ్యమంత్రిని ఒక్కమాట మాట్లాడ నీయకుండా అడ్డుకొని సమ్మక్క సారక్కల తెగువను చూపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరిట ఉమ్మడి వరంగల్ జిల్లా మానుకోట ప్రాంతానికి రావాలని ప్రయత్నిస్తే కేయూ, మానుకోట విద్యార్థులు, ప్రజలతో మమేకమై రైల్వేస్టేషన్‌లోనే రాళ్ల తో బుద్ధిచెప్పిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది విద్యార్థులకు తూటాల దెబ్బలు తగిలాయి.

తెలంగాణ ఉద్యమశక్తిని, ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించడం కోసం ట్యాంక్‌బండ్‌పై లక్షలాది మందితో మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునివ్వగా, క్యాంపస్ మొత్తం పోలీసులతో నిండిపోయినా కొంతమంది విద్యార్థి నాయకులు పేషెంట్లుగా మారి అంబులెన్స్ లో హైదరాబాద్‌కు వెళ్లారు. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆంధ్ర ప్రముఖులు, నాయకుల విగ్రహాలను కూల్చివేశారు. 

తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎన్నిమార్లు కోరినా పట్టించుకోకపోవడంతో కేయూ విద్యార్థులు స్థాని క మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిమీద దాడికి దిగారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకులను మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేసి తెల్లవారుజాము వరకు అరెస్టు చూపించకుండా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల తిప్పారు. పోలీస్ దెబ్బలకు కేయూ జేఏసీ నేత యాకుబ్ రెడ్డి ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిపాలయ్యారు.

ఈ ఘటనతో తెలంగాణ రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాలలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యమం ప్రతి సందర్భంలో విద్యా ర్థుల పాత్ర అమోఘమైనది. ఈ సందర్భం గా విద్యార్థి నాయకులుగా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ దృష్టికి కొన్ని అంశాలు తీసుకుపోవాలని భావిస్తున్నా. రాజకీయ పార్టీ లు, ఉద్యోగ సంఘాలు, ఇతర జేఏసీలు వారి వారి పనులు చేసుకుంటూనే ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ, చదువులను, భవిష్యత్తును వదులుకొని ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసినది విద్యార్థులు మాత్రమే.

ఈ నేపథ్యంలో కేకే  నేతృత్వంలోని కమిటీ తొలుత గొప్ప త్యాగాలు చేసిన యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలతో సమావేశమవ్వాలి. క్యాంపస్ ప్రాంగణాల సాక్షిగా పోలీసు, మిలటరీ  బలగాలను తరిమికొట్టిన విద్యార్థుల తెగువే తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందనేది నగ్న సత్యం. అందుకే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కేయూ ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యార్థి ఉద్యమకారులకు మొదట న్యాయం చేయా లి. ఈ కమిటీ కాలయాపన చేయకుండా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి.

ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఇందిరమ్మ ఇల్లు, రూ.5 లక్షల భృతి/బీమా వంటి హామీలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి. అంతేగాకుండా ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వలె ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను ఏ, బీ, సీ, డీ క్యాటగిరీలుగా విభజించి ప్రభుత్వ ఉద్యోగా ల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఉద్యమకారుల కుటుంబాలకు హెల్త్‌కార్డు లు, పిల్లలకు విద్యలో రిజర్వేషన్లు కల్పించాలి. విద్యార్థి నాయకులపై ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేయాలి. ప్రతి యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థుల పోరాటానికి గుర్తుగా పైలాన్ ఏర్పాటు చేయాలి.

లిఖితమైన చరిత్ర మాత్రమే విద్యార్థుల త్యాగాలను భవిష్యత్ తరాలకి అందిస్తుంది. విద్యార్థుల పోరాట చరిత్రను సమాజం మర్చిపోయింది.  ఇప్పటికైనా ఈ పోరాటా న్ని పాఠ్యపుస్తకాలలో నమోదు చేయాలి. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల పోరాటాలకు, త్యాగాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయినా గుర్తుంపు లభిస్తుందని ఆశిస్తున్నాం.

వ్యాసకర్త: తెలంగాణ ఉద్యమ కేయూ జేఏసీ చైర్మన్, 9849789779

డా. సాదు రాజేష్