అల్పాహార పంపిణీకి అంకురార్పణ..

04-10-2026 | 09:16pm

- జిల్లాలోని 60 వేల మంది విద్యార్థులకు అల్పాహార పంపిణీ లక్ష్యం.                     

- మునగాలలో రూ. 9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం

- రేపు శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సూర్యాపేట, అక్టోబర్‌ 4 (విజయక్రాంతి): జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించేందుకు మునగాల మండలంలో రూ. 9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌(Community Kitchen) ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Minister Uttam Kumar Reddy)లు శంకుస్థాపన చేయనున్నారు.

మునగాల - మాధారం మధ్యలో:

సూర్యాపేట, కోదాడ మధ్యలో గల మునగాల మండలంలోనీ జాతీయ రహదారి పక్కన, మునగాల–మాధారం మధ్య ఎంపిక చేసిన స్థలంలో ఈ కేంద్రీకృత వంటశాలను నిర్మించనున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం నుంచి ఆహారం తయారు చేసి, ప్యాకింగ్‌, రవాణా, పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఈ వంటశాలను ఏర్పాటు చేయనున్నారు.

సింగరేణి విరాళంతో : 

కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణానికి సింగరేణి కంపెనీ రూ. 9.60 కోట్ల విరాళం అందించింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చేసిన విజ్ఞప్తుల మేరకు సింగరేణి ఈ నిధులను సమకూర్చినట్లు తెలుస్తుంది. ఈ నిధులతో అత్యాధునిక సదుపాయాలతో వంటశాలను ఏర్పాటు చేయనున్నారు.

1,029 విద్యాసంస్థలకు ఆహార సరఫరా : 

హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. జిల్లాలోని సుమారు 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తయారు చేసి సరఫరా చేయడం కమ్యూనిటీ కిచెన్‌ ప్రధాన ఉద్దేశం. అవసరాన్ని బట్టి ఎంపిక చేసిన కొన్ని జూనియర్‌ కళాశాలలకు మధ్యాహ్న భోజనం అందించే అంశాన్ని కూడా ప్రణాళికలో చేర్చడం గమనించదగిన విషయం.

నాణ్యత, పరిశుభ్రతలకు ప్రాధాన్యం : 

ఆహార నాణ్యత, పోషక విలువలు, పరిశుభ్రత, సురక్షిత నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ ఈ కమ్యూనిటీ కిచెన్ ను నిర్మించనున్నారు. ఈ వంటశాలలో ఆహార తయారీ, ప్యాకింగ్‌, రవాణా, పంపిణీ కోసం సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు పాఠశాల వేళల్లో పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, సంక్షేమానికి తోడ్పడేలా దీనిని రూపొందిస్తున్నారు.

పనులపై మంత్రి పర్యవేక్షణ : 

కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణం, నిర్వహణ, ఆహార తయారీ, విద్యాసంస్థలకు సరఫరా వంటి అంశాలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సంబంధిత అధికారులు, అమలు భాగస్వాములతో సమన్వయం చేస్తూ ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని వారే చెబుతుండటం గమనార్హం. ఈ వంటశాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ నుండే జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందనుంది.                             

నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం:

ఏ వ్యక్తి ఎదుగుదలకైనా తోడ్పడేది విద్యయే. విద్యకు ఉన్న విలువను గుర్తించే ఈ ప్రభుత్వం విద్యార్థుల ఎదుగుదలకు తగిన ప్రాధాన్యతను ఇస్తుంది. అందులో భాగంగానే విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడంతో పాటు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ వంటశాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ నుండే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలకు అల్పాహారం అందిస్తాం. విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమానికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి కంపెనీకి కృతజ్ఞతలు.

  - నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి.

మరిన్ని వార్తలు