30 May, 2026 | 2:05 AM

‘ఓఎస్‌ఎం’పై అనుమానాలు

30-05-2026 01:33 AM
  1. సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల ఆందోళన
  2. రీవాల్యూయేషన్ పోర్టల్ తప్పుల తడక అంటూ వ్యాఖ్యలు
  3. తమ జవాబు పత్రాలకు అప్‌లోడ్ అయిన పత్రాలకు పొంతన లేదని అభ్యంతరాలు
  4. డిజిటల్ మూల్యాంకనం ఆమోదించలేమని సోషల్‌మీడియాలో పోస్టులు

న్యూఢిల్లీ, మే ౨౯: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తాజాగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానం తీవ్రవివాదాలకు దారితీ సింది. దేశవ్యాప్తంగా సుమారు 70,000 మంది ఉపాధ్యాయులు 98.66 లక్షల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేశారు.

మానవ తప్పిదాలను తగ్గించి, పారదర్శకతను పెంచేందుకే ఈ విధానం అమలు చేస్తున్నామని సీబీఎస్‌ఈ చెబుతున్నప్పటికీ, ఈనెల 13న రీ వాల్యూయేషన్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థుల్లో అనుమానాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే.. 12వ తరగతి ఉత్తీర్ణత శాతం గతేఏడాది 88.39 శాతం నమోదవగా, ఈసారి 85.2 శాతానికి పడిపోయింది. భౌతిక, రసాయనశాస్త్రాలు, గణితం వంటి ముఖ్య సబ్జెక్టుల్లో ఊహించిన దానికంటే 20 నుంచి 40 మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది.

ఈ పరిణామాలన్నింటికీ ఓఎస్‌ఎం విధానమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తు న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు తన పొరపాట్లు, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థులు జవాబు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించగానే ఆన్‌లైన్ పోర్టల్ క్రాష్ కావ డం, ఒకే దరఖాస్తుకు రెండు, మూడుసార్లు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ కావడం విద్యార్థుల అనుమానాలకు తావిచ్చింది. సాంకేతిక లోపాలను గుర్తించిన సీబీఎస్‌ఈ విద్యార్థులు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేస్తామని చెప్పింది. వ్యవస్థను పునరుద్ధరించడానికి ఐఐటీ మద్రాస్, కాన్పూర్ నిపుణు లను, కొందరు బ్యాంకింగ్ నిపుణులను సైతం రంగంలోకి దింపింది.

ప్రిన్సిపాల్స్‌కు అనధికారిక ఆదేశాలు

ఓఎస్‌ఎం విధానాన్ని సమర్థిస్తూ స్కూల్ ప్రిన్సిపాల్స్‌కు సీబీఎస్‌ఈ ఇప్పటికే ఒక టూల్‌కిట్ చేరవేసిందని, సోషల్‌మీడియాలో ఈ విధానంపై అనకూల ప్రచారం చేయాలని ప్రిన్సిపాల్స్‌కు అనధికార ఆదేశాలు కూ డా వచ్చాయనే ప్రచారం ఊపందుకున్నది. ప్రిన్సిపాల్స్ ఇక నుంచి డిజిటల్ మూల్యాంకనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా సంభాషించాలనేది ఆ అనధికారిక ఆదేశమని తెలుస్తున్నది.

దీనిలో భాగంగానే ఒకేరోజు దేశవ్యాప్తంగా ప్రిన్సిపాల్స్ డిజిటల్ మూల్యాంకనాన్ని ప్రశంసి స్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం విద్యార్థుల్లో అనుమానాలను మరింత పెంచుతున్నది. ఆయా వీడియోల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రిన్సిపాల్స్ చెప్పుకొచ్చిన అంశాలన్నీ, ఒకే విధంగా ఉండటం కలకలం రేపుతున్నది.

పక్కా స్క్రిప్ట్ ప్రకారమే వారంతా సోషల్‌మీడియా ప్రచారాన్ని మొదలు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఓఎస్‌ఎం విధానం అత్యుత్తమని సోషల్‌మీడియా వేదికగా కొన్నిచోట్ల విద్యార్థులతో చెప్పించేందుకు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

విద్యార్థుల అభ్యంతరాలు..

సీబీఎస్‌ఈ ౧౨వ తరగతి ఫలితాలు విడుదలైనప్పటి నుంచి విద్యార్థులు అయోమ యంలో ఉన్నారు. ఓఎస్‌ఎం పోర్ట్‌ల్‌లో అప్‌లోడ్ చేసిన జవాబుపత్రాలు సరిగా కనిపిం చడంలేదని వారు ఆరోపిస్తున్నారు. స్కానిం గ్ సరిగా లేక పేజీలు సరిగ్గా కనిపించడం లేదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ చేతిరాతకు, పోర్టల్‌లో అప్‌లోడ్ అయి న పేజీలకు సంబంధం లేదని వాపోతున్నారు. జవాబు పత్రాల్లోని మార్కుల్లోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయని చెప్తున్నారు.

ఓఎస్‌ంఎం విధానంపై కేవలం విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఓఎస్‌ఎంపై సరైన శిక్షణ ఇవ్వలేదని, మూల్యాంకన సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కంప్యూటర్ స్క్రీన్‌లపై పేపర్లు దిద్దడం కష్టంగా మారిందని వాపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పేపర్లు దిద్దాలని సీబీఎస్‌ఈ ఒత్తిళ్లకు గురిచేస్తున్నదని వెల్లడిస్తు న్నారు. కొన్నిసార్లు జవాబుపత్రాల స్కానిం గ్ సాంకేతికంగా కష్టతరమవుతున్నదని, దీంతో గత్యంతరం లేక తాము పాత పద్ధతిలోనే చేత్తో దిద్దాల్సి వస్తున్నదని చెప్తున్నారు.

సాంకేతిక లోపాలు వాస్తవమే సీబీఎస్‌ఈ, కేంద్ర విద్యాశాఖ : మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ

ఓఎస్‌ఎం విధానంపై దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సీబీఎస్‌ఈ స్పందించింది. పరీక్షల మూల్యాంకనంలో పారదర్శకత పెంచేందుకే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చామని స్పష్టం చేసింది. మూల్యాంకన పోర్టల్‌లో ఎలాంటి అవకతవకలకు తావులేదని తెలిపింది.

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. కొత్త విధానం అమలులో కొన్ని సాంకేతిక లోపాలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. లోపాలన్నింటినీ సవరించేందు కు సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తప్పులను సరిదిద్దుతామని హామీ ఇస్తూనే, డిజిటల్ సంస్కరణలను ఆయన సమర్థించారు. డిజిటల్ ఇండియాను వ్యతిరేకించే వారే ఈ సంస్కరణలను తప్పుబడుతు న్నారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.