నా ప్రాధాన్యం తగ్గొద్దు!
- కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి..
- నా కుమారుడు, అనుచర వర్గానికి క్యాబినెట్‌లో స్థానం కల్పించాలి
- కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
- ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌కు విజ్ఞాపన
- క్యాబినెట్ కూర్పుపై అధిష్ఠానం కసరత్తు
- సిద్ధు రాజీనామాను ఆమోదించిన గవర్నర్
- నేటి సాయంత్రం సీఎల్పీ భేటీ
బెంగళూరు, మే 29: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాలపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం, పార్టీ మధ్య వారధిలా పనిచేసేందుకు ఒక సమన్వయ కమిటీని (కోఆర్డినేషన్ కమిటీ) ఏర్పాటు చేయాలని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది. కర్ణాటక కొత్త క్యాబినెట్‌లో తన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవి లేదా కీలక మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కోరినట్లు సమాచారం.
తన అనుచరులకు కూడా మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించాలని రాహుల్ గాంధీతో స్పష్టం చేసినట్లు తెలిసింది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపైన, రాబోయే రాజ్యసభ ఎన్నిలకన కూడా కసరత్తు చర్చిలు నడిశాయి. ఈ సారి నలుగురు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది. మరోపక్క మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ శ్రేణులు, ఆశావహులు తీవ్ర పోటీ పడుతున్నారు. నేడు కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ కానుంది.
సీఎల్పీనేతగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఎన్నుకోన్నుట్లు సమాచారం. సిద్ధరామయ్య రాజీనామాను శుక్రవారం గవర్నర్ ఆమోదిస్తూ.. మంత్రివర్గాన్ని రద్దు చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని ఉత్తర్వులిచ్చారు. తను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో డీకేఎస్ సిద్ధరామయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు. మాజీ సీఎం సిద్ధు సేవలను కొనియాడారు.
గురువారం కర్నాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ఢిల్లీలోనే ఉంటూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడిగా చర్చలు జరుపుతున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్యతో కలిసి శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ అయ్యారు. 10 జనపథ్‌లో ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కేజే జార్జ్, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే కుమారుడైన ప్రియాంక ఖర్గే కూడా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.
రాహుల్‌గాంధీతో సిద్ధరామయ్య దాదాపు గంటసేపు చర్చించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటకకు సంబంధించిన పార్టీ అంతర్గత సంస్థాగత సమస్యలు వంటి కీలక అంశాలపై చర్చించారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం ఉన్నందున, తదుపరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి చుట్టూ కూడా చర్చ కేంద్రీకృతమైనట్లు సమాచారం. తన అనుచరులకు కూడా మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించాలని రాహుల్ గాంధీని గట్టిగా కోరారు.
పభుత్వం, పార్టీ మధ్య వారధిలా పనిచేసేందుకు ఒక సమన్వయ కమిటీని (కోఆర్డినేషన్ కమిటీ) ఏర్పాటు చేయాలని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని పట్టుపట్టినట్లు సమాచారం. ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా కొనసాగవచ్చని ఆయన భావిస్తున్నారు.
సిద్ధరామయ్య ప్రతిపాదనపై కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా స్పందించలేదు. దానికి అంగీ కరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కూడా సిద్ధరామయ్య సమావేశమయ్యారు.
నలుగురు డిప్యూటీ సీఎంలు?
సిద్ధరామయ్య క్యాబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులకు డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు నలుగురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జార్కిహోళిని కొత్త ప్రభుత్వంలో నలుగురు ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా లేదా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్ష పదవిని గానీ నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే కర్ణాటకలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో, కాంగ్రెస్ మూడు సీట్లు, బీజేపీ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది. జూన్‌లో మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ సీటు ఖాళీ అవుతుండగా, ఆయన కర్ణాటక నుంచి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్‌ను కూడా రాజ్యసభ అభ్యర్థులలో ఒకరిగా బరిలోకి దించే అవకాశం ఉంది. కాంగ్రెస్ భర్తీ చేయాల్సిన మరో ఖాళీ ఉంది. ఆ విషయంపై కూడా చర్చలు జరినట్లు సమాచారం.
మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ
మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొత్త క్యాబినెట్‌లో చోటు కోసం కర్నాటక కాంగ్రెస్ నేతల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు మంత్రి పదవుల కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. మరోవైపు బెంగళూరు కాంగ్రెస్ శ్రేణులు సీనియర్ నేత రామలింగారెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నాయి.
అలాగే కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వర్ ఖండ్రేను ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించాలని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిపాదిం చారు. ఈ మేరకు వారు పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు వినతిపత్రం సమర్పించారు.
సిద్ధరామయ్యపై డీకేఎస్ ప్రశంసల జల్లు
సిద్ధరామయ్యపై డీకేఎస్ ప్రశంసల జల్లు- కురిపించారు. ఆయన పట్టుదలకు, సామాజిక న్యాయం పట్ల నిబద్ధతకు నిదర్శనమని డీకే శివకుమార్ కొనియాడారు. కర్ణాటక సీఎం పీఠాన్ని డీకే శివకుమార్ అధిరోహించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఆయన శుక్రవారం సోష ల్ మీడియాలో పోస్టు చేశారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య నిలకడ, పట్టుదల, సామాజిక న్యాయానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం డీకేఎస్ కొనియాడారు.
సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానాన్ని, నాయకత్వాన్ని ప్రశంసించారు. ‘దేవుడు వరాలు లేదా శాపాలు ఇవ్వడు. ఆయన కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలను మనం ఎలా ఉపయోగించుకున్నామన్నదే కీలకం. సిద్ధరామయ్య జీవి తం ఆ ఆలోచనకు అత్యుత్తమ ప్రతిబింబం. మైసూరులోని ఒక సాధారణ గ్రామం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం, ఆయన నిలకడకు, పట్టుదల, సామాజిక న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది’ అని డీకే శివకుమార్ పోస్టు చేశారు.
2020లో తనకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి నప్పటి నుంచి సిద్ధరామయ్య తనకు అండగా నిలిచారని శివకుమార్ పేర్కొన్నారు. ఆయన తో కలిసి డిప్యూటీ సీఎంగా పనిచేయడం ఒక విశేష గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.ఆ సీనియర్ నాయకుడి అనుభవం, రాజకీయ దూరదృష్టి నుంచి తాను నిరంతరం నేర్చుకుంటునే ఉన్నానన్నారు.
పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ శివకుమార్ చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఓ సామెత చెప్పినట్లు, మీరు వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవండి. మీరు చాలాదూరం నడవా లంటే కలిసి నడవండి. కర్ణాటక ప్రజల కోసం ఈ ప్రయాణాన్ని కలిసి ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.
నేడు కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ
కర్నాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. బెంగళూరులోని విధాన సౌధ కాన్ఫరెన్స్ హాల్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది. ఈ సమావేశంలో సీఎల్పీ నూతన నాయకుడిని అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ శాసనసభా పక్ష కార్యదర్శి అల్లంప్రభు పాటిల్ సమాచారం పంపారు. ఈ భేటీ తర్వాత కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై పూర్తి స్పష్టత రానుంది.
సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించిన గవర్నర్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. గవర్నర్ మధ్యప్రదేశ్ పర్యటనలో ఉండటంతో లోక్‌భవన్‌కు వెళ్లిన సిద్ధరామయ్య గురువారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను గవర్నర్ ప్రత్యేకకార్యదర్శి ప్రభుశంకర్‌కు అందజేసిన విషయం తెలిసిందే.
అనంతరం అర్ధరాత్రి బెంగళూరుకు వచ్చిన గవర్నర్ శుక్రవారం ఉదయం అధికారికంగా రాజీనామాను ఆమోదించారు. అదే సమయంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు గవర్నర్ లోక్‌భవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకూ సిద్ధరామయ్య తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.
3న సీఎంగా డీకేఎస్ ప్రమాణం!
డీకే శివకుమార్(డీకేఎస్) జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులో కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రభుత్వవ ర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా పార్టీలో తలెత్తిన అడ్డంకులన్నీ క్లియర్ కావడం, సీఎం సిద్ధరామయ్య రాజీనా మాను గవర్నర్ ఆమోదించడంతో ఎట్ట కేలకు డీకేఎస్ కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్నారు.
లోక్‌భవన్ గ్లాస్ హౌస్ లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి కర్ణాటక వ్యాప్తంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, క్యాబినెట్ సహచ రులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారు లు హాజరవుతారని భావిస్తున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదింపుల అనంతరం సిద్ధ రామ య్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే 64 ఏళ్ల వయసు లో ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకేస్ ముఖ్యమంత్రి కానున్నారు. అయితే ఈ విషయంపై లోక్‌భన్ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.






