అంత సరళతరం కాదు!
- భారత్‌లో వ్యాపారం అంత సులభతరమేమీ కాదు
ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు కేంద్రం కృషి
అయినా మెరుగుపడని పరిస్థితులు
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సరళతర వ్యాపారం) మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. వ్యాపారులకు సరళమైన వ్యాపార అనుభవం అందించేందుకు కృషి చేస్తోంది. ఈ అంశంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమై న పోటీతత్వాన్ని పెంచేందుకు ర్యాంకులు అందించి, రాష్ట్రాలను ప్రోత్సహిస్తోంది. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సరళీకృత వ్యాపారం చేయడంలో భారత్‌లో నెలకొల్పిన సంస్థలు ఇంకా ఇబ్బందులు తప్పట్లేదు. అనేక చట్టాలు, చాలా అనుమతులు పొందాల్సి వస్తోంది.
వెయ్యికి పైగా చట్టాలు, రూల్స్..
టీమ్‌లీజ్ అనే నియంత్రణ అనుమతుల నిర్వహణ సంస్థ ఓ పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. ఈ పరిశోధన ప్రకారం దేశంలో ఏకంగా 1,536 చట్టాలు, రూల్స్ ఉన్నాయని తేలింది. అంతేకాదు 69,233 అధికారిక అనుమతులు పొందాలని, 6,618 వార్షిక ఫైలింగ్స్ చేయాల్సి వస్తోందని ఆ ప్రతాల్లో పేర్కొంది. అయితే ఈ అన్ని చట్టాలను, రూల్స్‌ను, అనుమతులను పొందాల్సిన అవసరం ఉండదు. వ్యాపార స్వభావం, స్థాపించిన ప్రదేశం, ఉద్యోగుల సంఖ్య వంటి అంశాలను బట్టి.. ఏయే చట్టాల కింద ఏయే అనుమతులు పొందా లనే విషయం స్పష్టంగా ఉంది.
కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా కార్మికులకు సంబంధించిన అనుమతులు పొందాల్సి వస్తోంది. ఈ కార్మిక చట్టాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నాలు గు కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇందుకు కారణం పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి సరైన సహకారం లేకపోవడమే అని నిపు ణులు చెబుతున్నారు.






