calender_icon.png 4 February, 2026 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిసె వాసులకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్

04-02-2026 07:46:31 PM

– దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

సనత్‌నగర్,(విజయక్రాంతి): మీకు నేను అండగా ఉంటాను... మీరు ఎవరికి భయపడొద్దు...ధైర్యంగా ఉండండి... అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని దాసారం బస్తీ గుడిసె వాసులకు హామీ ఇచ్చారు. బుధవారం గుడిసె వాసులపై  ప్రయివేట్ వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సార్ నగర్ CI శ్రీనివాస్ రెడ్డి ని ఆయన ఆదేశించారు.

గత 30 సంవత్సరాల నుండి ఇక్కడే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న వీరిని ఇక్కడి నుండి ఖాళీ చేయించి ఈ స్థలాన్ని ఆక్రమించాలని కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తూ వస్తున్నారని వివరించారు. గుడిసె వాసులను ఖాళీ చేయించేందుకు భయబ్రాంతులకు గురిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. గుడిసె వాసుల జోలికి వెళ్లవద్దని ఇటీవల కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ పేపర్ ను CI కి ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, కూతురు నర్సింహ, బలరాం, ఖలీల్, రాజేష్ ముదిరాజ్, హరిసింగ్, బాలరాజ్, జమీర్, శేఖర్ తదితరులు ఉన్నారు.