17 August, 2026 | 10:12 PM

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఝాన్సీ సరస్వతి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ

17-08-2026 09:40 PM

జవహర్ నగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి):  మేడ్చల్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఝాన్సీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్‌లోని మోహన్ రావు నగర్ కాలనీకి చెందిన ఝాన్సీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాల నుంచి మొత్తం 39 మంది విద్యార్థులు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారు.

అండర్-18 విభాగంలో పూర్వ విద్యార్థి మొగిలిపాక సంతోష్ లాంగ్ జంప్‌లో మూడో బహుమతి సాధించారు. పదో తరగతి విద్యార్థి యు రమేష్ హైజంప్‌లో ద్వితీయ బహుమతి సాధించగా, తొమ్మిదో తరగతి విద్యార్థి డి. ప్రణయ్ లాంగ్ జంప్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను పాఠశాల కరస్పాండెంట్ కురుమ అరుణ్ కుమార్ యాదవ్ అభినందించారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన శిక్షణ అందిస్తామని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు.