17 August, 2026 | 8:55 PM

రైస్ మిల్ పరిశ్రమను కాపాడాలి..

17-08-2026 08:24 PM

--రైస్ మిల్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ 

-- సీఎం రేవంత్ రెడ్డికి వినతి

ములుగు, ఆగస్టు 17 (విజయక్రాంతి): తెలంగాణలో రైస్ మిల్ పరిశ్రమను కాపాడాలని రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వివిధ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి బాదం ప్రవీణ్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడారు.

పేద ప్రజలకు సన్న బువ్వ పెట్టాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణలో రైతులకు సన్న ధాన్యం పండించే విధంగా క్వింటాకి 500 బోనస్  ఇస్తుండటం తోపాటు సదురు పథకంలో మిల్లర్లను సైతం భాగస్వామ్యం చేసినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ధాన్యం సేకరణ నుండి బియ్యం డెలివరీ చేసే వరకు రైస్ మిల్లర్లు అనేక సమస్యలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యం మిల్లులకు ఇచ్చినంత వేగంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ బియ్యం తీసుకోకపోవడం వలన మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.

మిల్లుల వద్ద దిగుమతి చేసుకున్న ధాన్యం 60 రోజుల తరువాత నిల్వ ఉంచిన ధాన్యం వెయిట్ లాస్ అవుతుందని వెయిట్ లాస్ అవ్వడం వలన దించుకున్న ధాన్యంలో 10 శాతం నష్టం వస్తుందని తెలిపారు. దిగుమతి చేసుకున్న ధాన్యం 60 రోజుల తర్వాత వెయిట్ లాస్ తో పాటు డ్యామేజ్ డీప్ కలర్ అవుతుందని, డ్యామేజ్ అవడం వలన స్టార్క్స్ మిషన్ ద్వారా బియ్యం శుభ్రం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.

డ్యామేజ్ 10 శాతం వరకు రికవరీ ఫ్యాక్టరీలకు డ్యామేజ్ బియ్యంను అమ్ముకోవాల్సి వస్తుందని, అందువలన ఒక క్వింటల్ బియ్యంకు 600 రూపాయల నుండి 750 రూపాయల వరకు నష్టం జరుగుతుందని తెలిపారు. దిగుమతి చేసుకున్న ధాన్యంకు 90 రోజుల లోపు బియ్యం 67 శాతం 91వ రోజు నుంచి 60 శాతం 64 శాతం బియ్యం పెట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలించాలని కోరారు. పెరిగిన విద్యుత్తు వాడకం, లేబర్ చార్జీలు, మిషనరీ చార్జీలు, స్టార్క్స్ వలన జరిగే నష్టం వల్ల ఆర్థికంగా మిల్లర్లు చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బయట రాష్ట్రాలలో స్టార్క్స్ వేసి ఇచ్చే బియ్యం క్వింటాల్ కు 150 రూపాయలు చెల్లిస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా మిల్లింగ్ చార్జీలు పెంచాలని కోరారు. 124 హెచ్పి నుండి 199 హెచ్పి వరకు ఎల్ టి కెటగిరి లోనే ఉండే విధంగా విద్యుత్ టారిఫ్ ను సవరించాలని కోరారు. పాత గన్ని సంచుల లో ధాన్యం మిల్లులకు వస్తుంది, వచ్చిన పాత గన్ని సంచులు రిపేర్ చేయించి మళ్లీ ధాన్యం కొనుగోలు సెంటర్లకు పంపించడం వలన రెండు సీజన్లకే గన్ని సంచి పనికిరాకుండా పోతుంది.

పాత గన్ని సంచి ధర బహిరంగ మార్కెట్లో 10 నుండి 15 రూపాయలు ఉంటుంది, కానీ ప్రభుత్వం పాత గన్ని రేటును 28 నుండి 35 రూపాయల వరకు మిల్లర్ల మీద వేయడం వలన ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో రైతులు పండించిన ధాన్యము, మిల్లర్లు పంపించే బియ్యం నిల్వ చేయుటకు జిల్లాలో గోదాములు నిర్మించాలని, గోదాముల కొరత వలన ఇతర జిల్లాలకు బియ్యం డెలివరీ చేయడం వలన ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు మిల్లర్లపై పడి మిల్లర్ పై, ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుందని అన్నారు.కాబట్టి జిల్లాలకు కావలసిన గోదాములు నిర్మాణ చేయాలని కోరారు.

ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు లోబడి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యం దిగుమతి చేసుకొని ఎఫ్ సి ఐ కి బియ్యం పడితేనే బియ్యంలో నాణ్యత లేదని రిజెక్ట్ చేస్తున్నారని తెలిపారు. అకాల వర్షాల వలన ప్రకృతి విపత్తుల వలన రైతుల నుండి తడిచిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం తీసుకోవడం వలన అందులో నుండి వచ్చిన బియ్యం ఎఫ్ సిఐలో పాస్ కాకపోవడం వలన ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. తడిచిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం నుండి వచ్చే బియ్యంను ఎక్స్‌పోర్ట్ కి పంపించాలి అనే నిబంధనను తొలగించి థర్డ్ పార్టీలకు ఇచ్చే విధంగా నిబంధనలు సవరించాలని అన్నారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చొరవ చూపాలని ఆయన కోరారు.