17 August, 2026 | 7:13 PM

అయోమయంలో.. మహేష్ గౌడ్...!

17-08-2026 06:37 PM

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అయోమయంగా పీసీసీ చీఫ్ కామెంట్

ఓసీ నేత కావడంతో మహేష్ గౌడ్ సన్నాయి నొక్కులు

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారా.. అంటే అవునే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ లైన్ ను దాటి ప్రవర్తిస్తున్న నేతల వ్యాఖ్యలపై, ఆగ్రహంపై ఎటూ తేల్చని విధంగా ఆయన చేస్తున్న ప్రకటనలు ఆయన అయోమయంలో ఉన్నారని తేటతెల్లం చేయడంతో పాటు.. ప్రజలను, పార్టీ కార్యకర్తలను కూడా అదే అయోమయానికి గురిచేస్తున్నారని వారంటున్నారు. 

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీపై, పార్టీ నేతలపై, ప్రభుత్వం తీరుపై చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా అయోమయంలో ఉన్నారని వారంటున్నారు.

'ఎవర్రా మీరంతా.. కాంగ్రెస్ పార్టీతోనూ.. తెలంగాణతోనూ.. తెలంగాణ ఉద్యమంతోనూ సంబంధం లేని వారందరూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే అర్థంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. అంతే స్థాయిలో పార్టీలోనూ కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు అయిన మహేష్ కుమార్ గౌడ్ దీనిపై స్పందించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ కూడా వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. పార్టీ లైన్ ను దాటవద్దని సూచించారు. రాజగోపాల్ రెడ్డికి గతంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ హైకమాండ్ కు విన్నవిస్తానంటూ చెప్పుకొచ్చారు.

చర్యలేవీ...

అయితే పార్టీ లైన్ దాటి.. నేరుగా.. సూటిగా ప్రశ్నిస్తున్న రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అందరూ వేలెత్తి చూపుతున్నారు. అదే బీసీ, దళిత వర్గాలకు చెందిన నేతలైతే.. ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చి.. చర్యలు తీసుకునేవారని వారంటున్నారు. కేవలం అగ్రవర్ణం కావడంతోనే రాజగోపాల్ రెడ్డికి కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేందుకు పీసీసీ వెనుకాడుతున్నట్టు వారంటున్నారు.

రాజగోపాల్ రెడ్డి చేస్తున్న హాట్ హాట్ కామెంట్లకు పీసీసీ అధ్యక్షుడు కక్కామింగలేని పరిస్థితిలో ఉన్నట్టు చెబుతున్నారు. పైగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనలోని అయోమయాన్ని తెలుపుతున్నాయని.. ఒకపక్క పార్టీ లైన్ దాటవద్దని చెబుతూనే.. పార్టీ గతంలో హామీ ఇచ్చి ఉండవచ్చని అంటున్నారంటే.. రెండు పడవలపై పీసీసీ ప్రయాణం చేస్తున్నట్టుగా పార్టీ కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది. ఏదేమైనా.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా అన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కడంతో.. అందరిలోనూ అదే అయోమయం కనపడుతోంది..!