వైద్యుల భద్రతపై టాస్క్‌ఫోర్స్
- డాక్టర్ల నేతృత్వంలోనే ఏర్పాటు చేస్తాం
- ఇప్పుడు వైద్యుల భద్రతే అతిపెద్ద అంశం
- మరో దారుణం జరిగేదాకా దేశం చూడలేదు
- దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటన
- కర్ దవాఖాన, బెంగాల్ సర్కారుపై ఆగ్రహం
న్యూఢిల్లీ, ఆగస్టు 20: వైద్యుల భద్రతే దేశంలో ఇప్పుడు అతి ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. పని ప్రదేశాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన కోర్టు.. మంగళవారం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ కేసు విషయంలో బెంగాల్ ప్రభుత్వం, ఆర్జీ కర్ దవాఖాన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశం మరో లైంగికదాడి ఘటన జరిగేవరకు వేచి ఉండలేదని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.
మరో దారుణం జరిగేవరకు దేశం ఎదురుచూడలేదు
ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- మహిళలకు పని ప్రదేశాల్లో భద్రత లేనప్పుడు, ప్రాథమిక సమానత్వాన్ని కూడా తిరస్కరించినప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం అనేదానికి అర్థమేముంది?
- ప్రతిసారీ కాకపోయినా లైంగికదాడి, హత్య వంటి జరిగినప్పుడు దేశం మేల్కొనాలి. ఒక రాక్షస మనస్థత్వం గల కామాంధుడి చేత అమాయకురాలైన ఒక ఆడపిల్ల దారుణంగా బలైంది.
- వైద్యులు, న్యాయవాదులు, మహిళలు.. అన్ని వర్గాలు ఈ దారుణానికి వ్యతిరేకంగా శాంతియుత పోరాటం చేస్తు న్నారు. రాష్ట్రప్రభుత్వం తన అధికారాన్ని వారిని వేధించేందుకు వాడకూడదు.
- బాధితురాలి గౌరవ మర్యాదలను పట్టించుకోకుండా ఆమె ఫొటోలు, పేరు సోష ల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బాధితుల గుర్తింపును బయటపెట్టకూడదన్న తీర్పులు ఉన్నా పట్టించు కోవటం లేదు.
- సంస్థల్లో అంతర్గతంగానే లైంగిక హింస పుడుతున్నది. అందుకు అరుణా షాన్‌బాగ్ కేసే ఉదాహరణ.
- తీవ్రమైన నేరం జరిగిన కర్ దవాఖానలోకి ఓ అల్లరిమూక ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆర్జీ కర్ దవాఖానలో 700 మంది రెసిడెంట్ డాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు 30 మంది మహిళా వైద్యులు, 60 మంది పురుష వైద్యులే ఉన్నారు. దవాఖానలో భద్రతకు సీఐఎస్‌ఎఫ్ బలగా లను మోహరించండి.
- దవాఖానల్లో దురుసుగా ప్రవర్తించే ప్రజలను నియంత్రించే నర్సులు, వైద్యులు కనీసం విశ్రాంతి తీసుకొనేందుకు కూడా ప్రత్యేక సదుపాయాలు ఉండటంలేదు. సుదీర్ఘమైన డ్యూటీలు ముగించుకొని తిరిగి ఇండ్లకు చేరుకోవటానికి సరైన రవాణా సదుపాయాలు ఉండటంలేదు. దవాఖానల్లో భద్రతకు సీసీటీవీ కెమెరాలు లేవు.
- వైద్యుల సమ్మెతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల విధులకు హాజరుకావాలని కోరుతున్నాం.. అని ధర్మాసనం కోరింది.
ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు?
కోల్‌కతా వైద్యురాలి హత్య అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆర్జీ కర్ దవాఖాన యాజమాన్యం వ్యవహారశైలిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఘటనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకుంటే దవాఖాన ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు? చాలా సమయం తర్వాతగానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్ప గించలేదు. వారిని మూడు గంటలు ఎదురుచూసేలా చేశారు. మరి పోలీసులేం చేస్తున్నారు? ప్రభుత్వ దవాఖానలో అంత దారుణం జరిగితే వెంటనే చర్యలు తీసుకోకుండా ఏం చేశారు?
అల్లరిమూకలను దవాఖానలోకి అనుమతించి దాడులు చేసేం దుకు అనుమతించారా? మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించిన మూడు గంటల తర్వాత కేసు నమోదుచేస్తారా?’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐని ఈ నెల 22వ తేదీలోగా స్టేటస్ రిపోర్టు సమర్పిం చాలని ఆదేశించారు.
అడ్మిరల్ ఆర్తి సరిన్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్
నౌకాదల మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అడ్మిరల్ ఆర్తి సరిన్ నేతృత్వంలో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. ఇందులో ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌కు చెందిన డాక్టర్ ప్రతిమా మూర్తి, జోధ్‌పర్ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ గోవర్ధన్ దత్‌పురి, ఢిల్లీలోని గంగారామ్ దవాఖాన డాక్టర్ గంగారామ్ రావత్, రోహ్‌తక్‌లోని బీడీ శర్మ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అనితా సక్సేనా, జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ పల్లవి సప్లే, గురుగ్రామ్‌లోని పరాస్ దవాఖానలో న్యూరాలజీ విభాగం చైర్‌పర్సన్ డాక్టర్ పద్మ శ్రీవాత్సవ సభ్యులుగా ఉంటారు. ఈ టాస్క్‌ఫోర్స్ మూడువారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలో నడుస్తున్న అన్ని దవాఖానల్లో ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరం, లగేజీని చెక్ చేసే వ్యవస్థల ఏర్పాట్లు, వైద్యులకు విశ్రాంతి గదులు తదితర అంశాలను ఇది పరిశీలిస్తుంది.






