22 April, 2026 | 5:26 AM

హిందువులను రక్షించండి

21-08-2024 06:22 AM
  1. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు హేయం 
  2. వారి రక్షణకు భారత ప్రభుత్వం కదలాలి 
  3. శరణార్థులను భారత్‌లోకి అనుమతించాలి 
  4. వారికి తగిన వసతి, కనీస సౌకర్యాలు కల్పించాలి 
  5. హిందువు ఎక్కడున్నా ధర్మ ప్రచారం చేయాలి 
  6. ప్రభుత్వానికి నాలుగు శంకర పీఠాధిపతుల వినతి 

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకొని హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను భారత్‌లోని పలు ప్రముఖ పీఠాధిపతులు తీవ్రంగా ఖండించారు. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణకు ఆ దేశంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ టీవీలో ద్వారక పీఠాధిపతి స్వామి సదానంద సరస్వతి, జ్యోతిర్మఠ్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, కంచి పీఠాధిపతి స్వామి విజయేంద్ర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి స్వామి విధుశేఖర భారతి మహాస్వామితో ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి మంగళవారం చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు శంకరాచార్యులు హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. గతంలో ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లో ఇలాగే హిందువులపై దాడులు జరిగాయని, ఇప్పుడు ఆ సంస్కృతి బంగ్లాదేశ్‌కు పాకిందని ఆందోళన వ్యక్తంచేశారు.

భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

బంగ్లాదేశ్‌లో హిందువులను రక్షించేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ద్వారక పీఠం శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి సూచించారు. ‘పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్‌లాగే బంగ్లాదేశ్‌లోనూ పరిస్థితులు బాగాలేవు. ఈ విషయాన్ని హిందువులు గుర్తించాలి. ఆఫ్గనిస్థాన్‌లో తీవ్ర వివక్ష, దాడులతో హిందువులు పూర్తిగా వలస వెళ్లిపోయారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనూ అదే జరుగుతున్నది. అక్కడ ప్రభుత్వంతో ప్రజలకు వివాదం ఉన్నది. కానీ, హిందువులు ఏం తప్పు చేశారు? వాళ్లను ఎందుకు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు? వారికి ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే పాలకులతో చూసుకోవాలి. హిందువులనే ఎన్నుకొని మరీ ఎందుకు చంపుతున్నారు? వారి ఆలయాలను ఎందుకు కూలగొడుతున్నారు?’ అని ప్రశ్నించారు. 

హిందూ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వాలి 

బంగ్లాదేశ్‌లో హింసకు గురైన హిందువులు శరణార్థులుగా భారత్‌కు వస్తే స్వాగతించాలని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సూచించారు. ‘బంగ్లా దేశ్‌లో హిందువులు ఇప్పుడు తీవ్ర దాడులను, వివక్షను ఎదుర్కొంటున్నారు. వారు ప్రాణాలు కాపాడు కొనేందుకు భారత్‌కు వస్తుండగా సరిహద్దుల్లోనే మన ప్రభుత్వం ఆపేస్తున్నది. వారిని మన దేశంలోకి రానివ్వాలి.వారికి అవసరమైన ఆహారం, వసతి, వస్త్రాల వంటి కనీస అవసరాలు కల్పించేలా ప్రధాని చర్యలు తీసుకోవాలి. 

మనవల్ల ఏర్పడిన దేశంలో హిందువులపైనే దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగటం దారుణమని కంచి పీఠాధిపతి శంకరాచార్య స్వామి విజయేంద్ర సరస్వతి అన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందువులు 27 శాతం ఉండేవారు. ఇప్పుడు ఆరు శాతానికి పడిపోయారు. అక్కడ హిందువుల రక్షణ కోసం భారత్ గట్టిగా పోరాడాలి. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి కూడా శ్రద్ధ తీసుకోవాలి’ అని సూచించారు.

హిందువుల కోసం హిందువులే పోరాడాలి

భారతదేశం ఏనాడూ ఎవరిపైనా యుద్ధాలు చేయలేదని, శాంతినే కోరుకొన్నదని శృంగేరీ శారదాపీఠం శంకారాచార్య స్వామి విధుశేఖర భారతి మహాస్వామి అన్నారు. ‘భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందు సంఘాలన్నీ సనాతనుల స్వీయ రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. మనమంతా సమైఖ్యంగా ఉన్నంతకాలం మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని పిలుపునిచ్చారు.