కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి
నలుగురు వ్యక్తుల అరెస్ట్
సికింద్రాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, లాలాగూడ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడిలో కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు లాలాపేటలోని జనప్రియ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ‘ఝాన్సీ’ అల్లంవెల్లుల్లి పేస్ట్ గోడ్పౌ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.
అక్కడ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో కల్తీ పదార్థాలతో పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు నీల వెంకటేశ్వర్లు తన సూపర్వైజర్ కె.వినోద్ మరియు ఇతర కార్మికుల సహకారంతో లాలాపేటలో ఈ గోడౌ ను నిర్వహిస్తున్నాడు. అల్లంవెల్లుల్లి పేస్ట్లో ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసి, నకిలీ బ్రాండ్ లేబుల్స్ అతికించి ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసి వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ విధంగా అక్రమంగా భారీ లాభా లు ఆర్జిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో భాగంగా పోలీసులు 1915 కిలోల అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను వివిధ పరిమాణాల బాక్సులు, 18 ప్లాస్టిక్ టబ్బులలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల ఎసిటిక్ యాసిడ్, సుమా రు 10 కిలోల క్సాంతమ్ గమ్, ఒక గ్రైండర్/మిక్సింగ్ మెషిన్, ఒక వెయింగ్ మెషిన్, రెండు ప్యాకింగ్ మెషీన్లు, 80 కిలోల ముడి అల్లంవెల్లుల్లి, నాలుగు డేట్ స్టాంపులు, ‘ఝాన్సీఎం’ పేరుతో ఉన్న 86 లేబుల్స్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.
ఈ కేసులో నీల వెంకటేశ్వర్లు (56), కె. వినోద్ (46) సహా నలుగురిని అదుపులోకి తీసుకుని లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిని సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జె. రాజశేఖర్, లాలాగూడ ఇన్స్పెక్టర్ టి. అశోక్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్.రాజు,రాజేశ్వర్ రెడ్డి,వారి బృందంతో కలిసి విజయవంతం గా నిర్వహించినట్లు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె శ్రీనివాసరావు వెల్లడించారు.




