19 April, 2026 | 3:01 AM

హెచ్‌సీఏ టీ20 లీగ్‌పై టీసీఏ అభ్యంతరం

19-04-2026 01:07 AM

హైదరాబాద్, ఏప్రిల్ 18: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషవ్ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మండిపడింది. హెచ్‌సీఏ కొత్తగా ప్రతిపాదించిన టీ20 లీగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసీసీఐ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఈ టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌సీఎ, టీసీఏ సహకార అంశం బాంబే హైకోర్టు విచారణ విచారణలో ఉండగానే ఈ లీగ్‌ను ప్రకటించడం సరికాదని పేర్కొంది.

దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి చెప్పారు.టీసీఏని భాగస్వామ్యం చేయకుండా జిల్లా పేర్లు, జిల్లా గుర్తింపు, జిల్లా నిర్మాణాలతో లీగ్ నిర్వహించడం చట్టవిరుద్ధమనీ, రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇది బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్స్ 28, 30, 31 ,38కు వ్యతిరేకమని తెలిపారు.    ఇప్పటికే 31 మార్చి 2026న బీసీసీఐకి లేఖ రాసి, హెచ్‌సీఏను హెచ్చరించి చర్యలు తీసుకోవాలని కోరిందని తెలిపారు.

గతంలో టీసీఏ  నిర్వహించిన టీ20  ప్రయత్నాలు వివాదాలు, యాజమాన్య హక్కుల గొడవలు తెచ్చాయని, ఇప్పటికీ పలువురు టీమ్ ఓనర్లు హక్కులు కోరుతున్నారని టీపేర్కొంది.  ఇన్వెస్టర్లు, ఫ్రాంచైజీ కొనుగోలుదారులు, స్పాన్సర్లు ఈ లీగ్‌లో పెట్టుబడి పెట్టేముందు అత్యంత జాగ్రత్త వహించాలని టీసీఏ హెచ్చరించింది.

బీసీసీఐ పర్యవేక్షణలో లేదా కోర్టు ఆదేశాల ప్రకారం ఈ లీగ్ నిలిపివేయబడే లేదా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపింది. బీసీసీఐ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల ప్రకారం, హైదరాబాద్ వెలుపల క్రికెట్ అభివృద్ధి విషయంలో హెచ్ సీఏ తప్పనిసరిగా టీసీఏతో సమన్వయం చేసుకోవాలి. ఆ ఆదేశాలను పాటించకుండా జిల్లాల పేర్లతో ఏ లీగ్ నిర్వహించినా అది చట్టపరంగా నిలబడదని తెలిపింది.