పంద్రాగస్టున డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ.!
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, జిల్లాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల చేతుల మీదుగా లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేయనున్నారు.
కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సదుపాయాలను మరింత పారదర్శకంగా, సులభతరంగా అందించడంతో పాటు లబ్ధిదారుల వివరాలను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.






