7 August, 2026 | 1:23 PM

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

07-08-2026 12:32 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నాలుగు దశల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఉపాధ్యాయులు శుక్రవారం పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ జిల్లా నాయకురాలు శాంతి కుమారి మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపును నిలిపివేయాలని, ప్రాథమిక విద్యకు సంబంధించిన జీవో–25ను వెంటనే సవరించాలని కోరారు.

కేజీబీవీ, సమగ్ర శిక్ష, యూఆర్‌ఎస్, గిరిజన సంక్షేమ, గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న గెస్ట్, పార్ట్‌టైం, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులందరికీ మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, జిల్లాల్లో డీఈఓ, మండలాల్లో ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, టెట్‌లో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని, స్పెషల్ టెట్‌ను సంబంధిత సబ్జెక్టుల వారీగా నిర్వహించాలని కోరారు. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల సమయ పట్టికలో మార్పులు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే దశలవారీగా పోరాట కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని యూఎస్‌పీసీ నాయకులు హెచ్చరించారు.