గణేష్ నిమజ్జనాల్లో విషాదం.. 13 మంది మృతి
హైదరాబాద్: తెలంగాణలో గణేశ్ నిమజ్జనాలు(Telangana Ganesh Immersion 2026) ప్రశాంతంగా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చినా.. పోలీసులు, ఇతర భద్రతా బలగాల సమన్వయంతో ఉత్సవాలు పెద్దగా అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగుతున్నాయి. రాష్ట్ర గణేశ్ పోర్టల్‌లో ఈ ఏడాది సుమారు 1.24 లక్షల విగ్రహాలు నమోదు కాగా.. గతేడాది నమోదైన సుమారు 1.15 లక్షలతో పోలిస్తే ఈ సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌లో నిమజ్జన శోభాయాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 25 వేలకుపైగా పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు TGSP, RAF, NDRF, OCTOPUS బలగాలను కూడా రంగంలోకి దించారు. ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రాంతాలపై సీసీటీవీలు, డ్రోన్లు, కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతర నిఘా కొనసాగింది.
అయితే పదిరోజుల గణేశ్ ఉత్సవాల సమయంలో 13 మంది మృతి చెందగా, 26 మంది గాయపడినట్లు డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) తెలిపారు. నిమజ్జన విధుల్లో ఉండగా ప్రమాదానికి గురై మృతి చెందిన కొత్తగూడెం టూటౌన్ ఎస్సై కె. వెంకన్న మృతి పోలీసు శాఖలో విషాదం నింపింది. ఆయన కుటుంబానికి ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. ఉత్సవాల నిర్వహణను పోలీసులు పలు దశలుగా విభజించి.. శోభాయాత్ర మార్గాలు, ట్రాఫిక్, బందోబస్తు, నిమజ్జన ప్రాంతాల్లో భద్రతను సమన్వయం చేశారు. మరోవైపు భైంసాలోనూ గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వివిధ మతాలకు చెందిన ప్రజలు పోలీసులకు సహకరించారని అధికారులు తెలిపారు.