9 July, 2026 | 2:10 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు విచారణ

09-07-2026 01:16 PM

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై(Fee Reimbursement)  తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం నాడు విచారణ జరిగింది. ఈ ఏడాది కొత్త అడ్మిషన్లకూ ఫీజు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 2,3,4వ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 15లోపు ఈ ఏడాది ఫీజు రీయెంబర్స్ మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కు రూ. వెయ్యి కోట్లు కావొచ్చని ప్రభుత్వ న్యాయవాది(Government lawyer) కోర్టుకు సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదంటూ పలు ఇంజినీరింగ్ కళాశాలలు(Engineering Colleges) కోర్టులో పిటిషన్లు వేశాయి. ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్ల తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదని పిటిషనర్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని ధర్మాసనానికి లెక్కచెప్పారు.

2023 నుంచి బకాయి ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తర్వాత కొంత గడువుతో మిగతా బకాయిలు చెల్లించేలా చూడాలని పిటిషనర్లు కోరారు. గత విచారణలో జీవో 9లో నాలుగు నిబంధనలపై హైకోర్టు షరతు విధించింది. జీవో 9లోని కొన్ని నిబంధనలపై విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్టే వల్ల కొత్తగా చేరిన విద్యార్థులకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం వివరించింది.