4 August, 2026 | 1:53 AM

తెలంగాణకు వెల్త్ కమిషన్ కావాలి

04-08-2026 12:20 AM

టి.చిరంజీవులు :

మరి ఇంత సంపద సృష్టి వీరికి ఎలా సాధ్యమైనది, ఒక్క తెలంగాణలోనే ఎలా సాధ్యం? 

నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? అని శ్రీశ్రీ మహా కవి మహాప్రస్థానం లో సామాన్యుల శ్రమను గుర్తు చేస్తూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షతో ఏర్పడింది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఖర్చు చేసిన నిధులు రూ.29 లక్షల కోట్లు (బడ్జెట్ ద్వారా రూ.21 లక్షలు + అప్పుతో 8 లక్షల కోట్ల ) సామాన్య ప్రజల జీవితాలను ఆశించిన స్థాయిలో మార్చలేకపోయాయి, ఇంకో వైపు  పాలక ఆధిపత్య కులాలకు మాత్రం ఆ నిధులు నీళ్లలా ప్రవహించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భారత ఆర్థిక వ్యవస్థ లో తెలంగాణ వాటా దాదాపు 0.9 శాతం పాయింట్లు పెరిగింది. ఆర్థిక వృద్ధి ఫలాలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాల్లో అదే స్థాయిలో ప్రతిబింబించలేదు,

కేవలం ఒక పుష్కర కాలంలోనే తెలంగాణలో అనేక మంది డాలర్ బిలియనీర్లు, వేల  కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన అత్యంత ధనవంతులు ఆధిపత్య కులాలు నుంచి పుట్టు కొచ్చారు.  ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, వనరుల కేటాయింపులు ఆధిపత్య కులాల కు  అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 

హురున్ ఇండియా 2026 రిపోర్ట్ ప్రకారం, భారత దేశం లో 308 మంది బిలినైర్స్ 112 లక్షల కోట్ల సంపద తో ఉండగా హైదేరాబద్ నగరం 3వ స్థానంలో ఉంది.  తెలంగాణలోని   18 మంది బిలియన్ డాల ర్స్ అనగా రూ.8,500 కోట్ల పైబడి ఉన్న వారి వివరాలు ఇలా ఉన్నాయి: హురున్ ఇండియా 2026 రిపోర్ట్ ప్రకారం రాజకీయ అధికారం, కులపక్షపాతం, ఆర్థిక ప్రయోజనాలు  ఒకదానికొకటి తోడ్పడుతూ వ్యవస్థీకృతంగా పనిచేయడంతోనే ఇది సాధ్యమైంది.

సంపద వ్యక్తిగత ప్రతిభతో మాత్రమే ఏర్పడదు. భూమి, విద్య, మూలధనం, రుణాల లభ్యత, రాజకీయసామాజిక నెట్వర్క్లు వంటి అంశాలు తరతరాలుగా ఒకే వర్గాలకు అందుబాటులో ఉండటం వల్ల సంపద కేంద్రీకరణ జరిగింది. తెలంగాణ లోచారిత్రకంగా భూమి  కొద్దిమంది  ఆధిపత్య కులాల చేతుల్లో ఉండటం వారికి పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, వ్యాపారాల్లో పెట్టుబడులకు బలమైన పునాది కల్పించింది. రాజకీయ అధికారం వల్ల భూములు, పరిశ్రమలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, మౌలిక వసతుల అవకాశాలు కూడా  వారికే దక్కాయి. బీసీలు కుల వృత్తులు నశించి ఉత్పత్తి దారుల నుంచి శ్రమను అమ్ముకునే వారీగా దిగజారిపోయారు. 

ఇంకో వైపు బహుజనుల అణచి వేత-   బడ్జెట్ కేటాయింపులలో తీవ్ర అన్యాయం-  తెలంగాణలో గత పన్నెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ అప్పులు మరియు ఇతర వనరుల ద్వారా సుమారు రూ. 28 లక్షల కోట్లకు పైగా వ్యయం చేసింది. అయితే, అదే కాలంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఖర్చు చేసిన మొత్తం కేవలం రూ. 28 వేల కోట్ల పరిధిలోనే ఉండటం తీవ్రమైన అసమానతను సూచిస్తోంది.

ఇందులో కూడా అత్యధిక భాగం విద్యార్థుల ఉపకార వేతనాలు, హాస్టళ్ల నిర్వహణ వంటి సంక్షేమ వ్యయానికే పరిమితమైంది. బీసీల ఆర్థిక స్వావలంబన, పారిశ్రామికాభివృద్ధి, స్వయం ఉపాధి, వ్యాపార ప్రోత్సాహం వంటి రంగాలకు కేటాయించిన నిధులు అత్యంత స్వల్పంగా ఉన్నాయి. ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాలుగా ఈ తరహా ఆర్థికాభివృద్ధి పథకాల కేటాయింపులు దాదాపు శూన్య స్థితికి చేరాయి.

దీని ఫలితంగా బీసీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలను కోల్పోయింది. స్వయం ఉపాధి పథకాల లేమితో కొత్త వ్యాపారాలు ప్రారంభించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ప్రభుత్వ కాంట్రాక్టులు, పెద్ద ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల పనులు ప్రధానంగా ఆధిపత్య వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమవడంతో, బీసీలు సంపద సృష్టి ప్రక్రియకు దూరమయ్యారు. ఫలితంగా ఈరోజు బీసీ యువతకు తమ శ్రమ, నైపుణ్యం తప్ప మరే ఆర్థిక ఆధారం లేకుండా జీవన పోరాటం సాగించే పరిస్థితి ఏర్పడింది.

కనీస వేతనాల సవరణలో నిర్లక్ష్యం 

కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలను ప్రతి 5 సంవత్సరాల కొక సారి సమీక్షించి సవరించడం ప్రభుత్వ బాధ్యత. అయితే తెలంగాణలో అనేక వర్గాల కార్మికులకు వర్తించే వేతనాలు 2012 నిర్ణయించిన స్థాయిలే దీర్ఘకాలం కొనసాగాయి. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, ధరల పెరుగుదలకు అనుగుణంగా సకాలంలో సవరణలు జరగలేదు. దీర్ఘ విరామం తర్వాత 2026 జూన్లో కనీస వేతనాల సవరణ జరిగింది. ప్రాజెక్టుల  మోజులో పడి పాలకులకు కార్మికులకు జీతాలు పెంచాలనే స్పృహ కూడా లేకుండా పోయింది.

రాజ్యాంగం ఏమి చెబుతోంది?

భారత రాజ్యాంగం కేవలం సమానత్వాన్ని మాత్రమే కాదు, ఆర్థిక న్యాయాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టికల్ 38  సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రోత్సహించాలి. ఆర్టికల్ 39(బీ)   దేశ సంపద అందరి ప్రయోజనానికి ఉపయోగపడేలా పంపిణీ కావాలి. ఆర్టికల్ 46  బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. అంటే రాజ్యాంగం లక్ష్యం కేవలం అవకాశ సమానత్వం కాదు; అవకాశాలకు చేరుకునే సామర్థ్యాన్ని కూడా పెంచడం.

తెలంగాణలో నేడు రాజకీయాలు డబ్బు మయంగ మారాయి. రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్య, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంట్రాక్టు, మీడియా, పారిశ్రామిక ,వ్యాపార   రంగాల్లో భారీ ఆర్థిక శక్తి కలిగిన ఆధిపత్య కుల వర్గాలు రాజకీయాల్లోకి ప్రవేశించడం, విపరీతము గ డబ్బులు ఖర్చుబెట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడం  మరియు ఇప్పటికే ఉన్న ఆస్తులను రక్షించుకోవడం పరిపాటయినది. సామాన్యుడు ఎన్నికలలో నిలబడే పరిస్థితి లేదు.

డా.బీఆర్ అంబేడ్కర్ రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదు; దానికి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం తోడుకావాలి  అని తేల్చి చెప్పారు ’ ఈ రక మైన ఆర్థిక అసమానతలు ప్రజా స్వామ్య మనుగడకు ఏ మాత్రం దోహదం చేయదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం భారత దేశం లో ఎక్కడ లేనన్ని అసమానతలు ఇక్కడ ఉన్నాయి . ఇక్కడ ఎన్ని ఉద్యమాలు జరిగిన అంతిమ లాభం ఆధిపత్య కులాలకు చేరింది . ఈ అసంతలు తగ్గాలి, సమ్మిళత అభివృద్ధి జరగాలి ఆంటే  సంపద కమిషన్ కావాలి

సంపద కమిషన్ ఎందుకు ?

తెలంగాణలో సంపద కేంద్రీకరణ, సంపద అసమానతలను అధ్యయనం చేసి, సంపద సృష్టి అవకాశాలను సమానంగా విస్తరించేందుకు స్వతంత్ర తెలంగాణ వెల్త్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ ఎవరి సంపదను స్వాధీనం చేసుకునేది కాదు; సంపద వికేంద్రీకరణకు అవసరమైన విధానాలను ప్రభుత్వానికి సూచిస్తుంది.

దీని విధులు రాష్ట్రంలో సంపద పంపిణీ, అసమానతలపై అధ్యయనం,వార్షిక తెలంగాణ వెల్త్ రిపోర్ట్ విడుదల, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు, కాంట్రాక్టులు, రాయితీల ప్రయోజనాలు ఏ వర్గాలకు చేరుతున్నాయో విశ్లేషణ, దీ, ూ, ూు, మైనారిటీలు, మహిళలకు మూలధనం, వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాతినిధ్యం పెంచే విధానాల సూచన, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాల సామాజిక ప్రభావంపై అంచనా.

ప్రముఖ ఆర్థికవేత్త లేదా మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన, ఆర్థిక, సామాజిక, గణాంక, పరిశ్రమ నిపుణులు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా ప్రతినిధులతో కమిషన్ ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం శాసనసభకు నివేదిక సమర్పించాలి.  దీని లక్ష్యం: సంపదను లాక్కోవడం కాదు.. సంపద సృష్టి అవకాశాలను సమానంగా పంచడం..  నేడు మాకు 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ’ కాదు, 3 ట్రిలియన్ సమాన అవకాశాల తెలంగాణ’ కావాలి. జీడీపీ పెరగడం ఒక్కటే అభివృద్ధి కాదు.

సంపద వికేంద్రీకరణ, సామాజిక న్యాయం, సమాన భాగస్వామ్యం జరిగినప్పుడే ఆర్థికాభివృద్ధి ,నిజమైన ప్రజాస్వామ్య ము . లేకపోతే సంపద కొద్దిమంది ఆధిపత్య వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై, బహుజనులకు సబ్ క సాథ్ సబ్ క వికాస్  ఒక డొల్లగా మారుతుంది. ఈ పరిస్థితి మారాలంటే బహుజనులకు రాజ్యాధికారం రావల్సిందేనని బహుజనులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని బహుజన వర్గాల పార్టీ లకే ఓటు వేసే చైతన్యం తెచ్చుకోవాలి. 

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్