4 August, 2026 | 1:48 AM

ప్రత్యేక ఆకస్మిక సెలవులు అవసరమే!

04-08-2026 12:15 AM

మనోహర్‌రావు చిలప్పగారి :

చాలా రాష్ట్రాలు ఉద్యోగుల సంక్షేమానికి అనేక సర్వీస్ నిబంధనలు రూపొందించుకుంటాయి. అందులోని భాగమే సెలవు నిబంధనలు కూడా. వీటిలోని ఒక వర్గం మాత్రం స్పెషల్ క్యాజువల్ లీవ్స్. ఆయా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, సందర్భాన్ని బట్టి ప్రత్యేక ఆకస్మిక సెలవులను అనుమతించడం జరుగుతుంది. అనగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, బ్లడ్ డొనేషన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పాల్గొనడానికి, సర్వీసెస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్‌కు ఇలా చాలా రకాలైన స్పెషల్ క్యాజువల్ లీవులను చాలా రాష్ట్రాలు అనుమతించడం జరిగింది.

దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వ సెలవు నిబంధనలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా కేరళం, తమిళనాడు రాష్ట్రాలు కొంతవరకు కర్ణాటక మొదలైనవి దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేని ప్రత్యేక సెలవు నిబంధనలు కొన్ని రకాలైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు విస్తరించడం జరిగింది.

ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై పడే శారీరక, మానసిక, ఆర్థిక భారాన్ని గుర్తించి బాధితులైన ఉద్యోగులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వాలు  ప్రత్యేక ఆకస్మిక సెలవులను అమలుపరుస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపి, కిడ్నీ వైఫల్యాలకు సంబంధించి క్రమం తప్పకుండా చేసే డయాలసిస్, ప్రధాన అవయవ మార్పిడి చికిత్సల వంటి తీవ్రమైన అనారోగ్యాలకు అందించే వైద్య విధానాలకు ప్రత్యక్ష చికిత్స దుపరి కోల్పోవడం కోసం తరచుగా తప్పనిసరిగా విధులకు దూరంగా ఉండవలసి వస్తుంది.

ఉద్యోగి సర్వీస్ సంక్షేమ దృక్పథానికి అనుగుణంగా ఉద్యోగులు తమ సాధారణ సెలవులను వినియోగించుకోకుండానే ఈ కీలకమైన వైద్య విధానాలు మరియు చికిత్సలను ఉద్యోగులు పొందడానికి, కేరళం, తమిళనాడు కొంతవరకు కర్ణాటక ప్రభుత్వం వారు ప్రత్యేకమైన ఆకస్మిక సెలవులను అనుమతిస్తున్నారు. ఇది ఉద్యోగులకు వారు కోరుకునే క్రమంలో ఆర్థిక బాధ్యతను, మనశ్శాంతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

కేరళం ప్రభుత్వం వారి ప్రభుత్వ ఉద్యోగులకు క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగమైన కీమోథెరపీకై ఒక క్యాలెండర్ సంవత్సరంలో 180 రోజులు, అట్లే రేడియేషన్ చికిత్స కై ఒక క్యాలెండర్ సంవత్సరంలో 180 రోజులు, గుండె సర్జరీకి 45 రోజులు, పేస్ మేకర్ అమర్చుకోవడానికి 45 రోజులు, ఏదైనా ఆర్గాన్ మార్పిడి 90 రోజులు, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం 90 రోజులు, అలాగే డయాలసిస్కు 90 రోజులు ఒక క్యాలెండర్లో అనుమతించడం జరుగుతుంది.

ఇదే కాక ఆయా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎవరైనా క్యాన్సరు, డయాలసిస్, హెచ్‌ఐవీ మొదలగు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతుంటే ఒక క్యాలెండర్ ఇయర్‌లో 15 రోజులు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు అనుమతించడం జరుగుతుంది. అలాగే ఆయా ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు ఎవరైనా శారీరక, మానసిక వికలాంగులు అయితే వారి చికిత్స లో భాగంగా సంవత్సరంలో 15 రోజులు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవులను అనుమతిస్తారు.

ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీమోథెరపీ చికిత్స కొరకు ప్రతి సెషన్కు 10 రోజులు మించకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరుగుతుంది. కర్ణాటక ప్రభుత్వం వారు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగుల డయాలసిస్ రోజును స్పెషల్ క్యాజువల్ లీవ్ గా పరిగణిస్తారు.

అట్లే క్యాన్సర్ తో బాధపడుతున్న ఉద్యోగుల చికిత్స ప్రణాళికలో భాగంగా 180 రోజులకు మించకుండా వైద్యుల యొక్క ధ్రువీకరణ పత్రాన్ని అనుసరించి ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేస్తారు. చాలా రాష్ట్రాల్లో కూడా అవయవ దానం చేసిన ఉద్యోగులకు మాత్రం 42 రోజుల వరకు మించకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ ను అనుమతించడం జరుగుతుంది. 

ఇక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పైరకాలైన వాదులతో బాధపడుతున్న ఉద్యోగులకు కేరళం లాంటి ప్రత్యేక ఆకస్మిక సెలవులను అనుమతించే ఉత్తర్వులు ఇంతవరకు వెలువడి ఉండలేదు. కానీ క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే ఉద్యోగులకు ఆరు నెలల వరకు సగము జీతం సెలవుపై పూర్తి జీతాన్ని మంజూరు చేసేం దుకు మాత్రమే ఉత్తర్వులు జారీ అయినవి.

కేరళం ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రత్యేక ఆకస్మిక సెలవుల విషయమై, మన రాష్ట్రంలో కూడా ఆయా ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వానికి నివేదించి తగు ఉత్తర్వులు పొందినట్లయితే, పై రకాల ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది.

వ్యాసకర్త: రిటైర్డ్ గవర్నమెంట్ అఫీషియల్