గిరిజనుల అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్

15-09-2026 | 11:59pm

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): గిరిజనుల రిజర్వేషన్ల(Tribal reservations)ను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బానోత్ హరిప్రియ నాయక్(Banoth Haripriya Nayak) అన్నారు. మంగళవారం ఇల్లెందులోని బీఆర్‌ఎస్‌(BRS) కార్యాలయంలో ఎస్టీ ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభ్యున్నతికి కేసీఆర్‌(KCR) ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు గురుకులాలు ఏర్పాటు చేసి, సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించిందని తెలిపారు.

పోడు భూముల సమస్యను పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టాలు అందించారని పేర్కొన్నారు. గిరిజనుల పట్ల కేసీఆర్‌ చేసిన కృషికి కృతజ్ఞతగా సెప్టెంబర్‌ 17న ప్రతి తండా, గూడెంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులను విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్ బిందు, బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్, సిలివేరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్ నాయక్, లక్కినేని సురేందర్, ఎస్.రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు