1 March, 2026 | 4:14 AM

తమిళనాట తెలుగు సోయగం

01-03-2026 12:50 AM

తెలుగు భామలు పొరుగు చిత్రసీమలపై మనసు పారేసుకుంటున్నారు. వీళ్లలో ఇంట గెలిచినవారు కొందరు కాగా.. మరికొందరు సొంత పరిశ్రమలో ఆదరణ లేక పక్క చూపులు చూస్తున్నవారూ ఉన్నారు. ఏది ఏమైనా తెలుగందం ఇతర ఇండస్ట్రీల్లో మెరువటం సంతోషించదగ్గ విషయమే. 

క్యామియోతో ఎంట్రీ.. నాయికగా బోణీ  

యూట్యూబ్ వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవిచైతన్య ‘బేబి’ చిత్రం ద్వారా యువ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన ఆ సినిమాతో తెలుగు నాట సూపర్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుందీ హైదరాబాదీ అందం. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతోనే మరో సినిమా చేస్తోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ కూడా తమిళ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన వైష్ణవి.. అజిత్‌కుమార్ నటించిన ‘వలిమై’ లో కోలీవుడ్ తెరపై తొలిసారి మెరిసింది. ఆ చిత్రంలో ఓ క్యామియో రోల్‌లో నటించిన వైష్ణవి ఇప్పుడు జీవీ ప్రకాశ్ సరసన కథానాయికగా ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే, వైష్ణవి చైతన్యకు తమిళం లో హీరోయిన్‌గా తొలి సినిమా ఇదే కానుంది.  

భారతీయ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు తొలుత టాలీవుడ్‌లో సత్తా చాటి, ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీల వైపు దృష్టి సారిస్తారు. అన్ని చోట్లా అదృష్టం పరీక్షించుకొని ఇక్కడికి వచ్చి సత్తా చాటిన వారు చాలా మందే ఉన్నారు. ఇటీవలి కాలంలో తెలుగు నాట పుట్టి పెరిగిన హీరోయిన్ల చూపు తమిళ ఇండస్ట్రీపై పడింది. అక్కడ అవకాశాలు వరుసగా వస్తుండటం.. అవి కలిసివస్తుండటంతో కోలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతూ వరుసపెట్టి ఛాన్సులు దక్కించుకోవటమే కాక, అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. 

రచ్చ గెలిచి.. ఇంట గెలిచిన అంజలి 

తనదైన అందం, అందుకు తగ్గ అంగీకంతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి. మోస్ట్ బ్యూటిఫుల్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రేక్షకాదరణ పొందిందీ బ్యూటీ. ఈ తెలుగందం తొలుత తమిళ సినిమాల ద్వారానే గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాతే టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సొంత ఇండస్ట్రీలోనూ విజయాలను అందుకుంది. అంటే రచ్చ గెలిచి, ఇంట గెలిచిందన్నమాట. ప్రస్తుతం అంజలికి కోలీవుడ్‌లో మంచి గుర్తిం పు ఉంది. 

తమిళంలోనూ ఈషా రెబ్బాకు గుర్తింపు 

‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటూ ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ఓరుగల్లు పిల్ల ఈషా రెబ్బా. ఈ సినిమాలో ప్రముఖ దర్శక నటుడు తరుణ్ భాస్కర్‌కు జోడీగా కనిపించింది ఈషా. ఈ థ్రిల్లర్ తమిళం మాట్లాడే ప్రాంతాల్లో మంచి ప్రేక్షకాదరణకు నోచుకుంది. అయితే, ఈషా ఓ ద్విభాషా చిత్రంలోనూ భాగమైంది. ఆ చిత్రమే ‘వరపోగుమ్ 24 మణిక్కుల్’. తెలుగులో ‘రాగల 24 గంటల్లో’ అని దీని అర్థం. తమిళ, -తెలుగు భాషల్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఇది.

ఈ సినిమాలో సత్యదేవ్ హీరో కాగా, ఆయన సరసన ఈషా రెబ్బా కథానాయిక అలరించింది. గత ఏడాది రమేశ్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఓ క్రైమ్ థ్రిల్లర్‌లో విక్రమ్ ప్రభుతో కలిసి పోలీసుగా నటించింది ఈషా. ఆమె గతంలో ‘నితమ్ ఒరు వానం’ అనే మరో తమిళ చిత్రంలోనూ నటించింది.

పొరుగింట ఆదరణ పొందుతున్న నటీమణుల్లో ఐశ్వర్య రాజేశ్, శ్రీగౌరీప్రియ పేర్లు కూడా బాగా వినిపిస్తాయి. వీళ్లతోపాటు ‘బస్‌స్టాప్’ బ్యూటీ శ్రీదివ్య కూడా తమిళంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. శ్రీగౌరీప్రియ ప్రస్తుతం తమిళంలో వరుసపెట్టి అవకాశాలను అందుకుంటోంది. ఈ భామకు కోలీవుడ్‌లో ఒకట్రెండు మంచి విజయాలు దక్కితే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి. ‘కోర్టు’ చిత్రంలో కథానాయికగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన శ్రీదేవి ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

రెండో సినిమానే క్రేజీ స్టార్‌తో..  

ఇప్పుడు మరో క్రేజీ బ్యూటీ కూడా పొరుగు బాట పడుతోంది. అంతేకాదు, ఆమె తమిళ నాట నటిస్తున్న రెండో సినిమానే క్రేజీ స్టార్‌తో చేసే అవకాశం దక్కించుకోవటం విశేషం. ఆమె ఎవరో కాదు.. ‘దెబ్బలు పడ్తయ్’ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా తన వైపు చూసేలా లీల చేసి శ్రీలీల. కొన్ని రోజుల క్రితమే శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’లో నటించింది. ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులను తొలిసారి పలకరించిన శ్రీలీల తాజాగా ధనుష్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. 

 - నరేశ్ ఆరుట్ల