మొగిలిచర్ల దేవాలయాలు!
గీసుకొండ మండలంలో చేరివున్న గ్రామం మొగిలిచర్ల “ఓరుగల్లును ‘ఏకశిలానగరం’ అని పిలిచినట్లే మొగిలిచెర్లను ‘కేతకీతటాకపురం’ అని పిలిచేవారు. మొగిలిపొదలు నిండిన చెరువున్న ఊరు కనుక మొగిలిచెర్ల అనే పేరు వచ్చిందేమో. గ్రామంలోని పోచమ్మగుడి వద్ద ఒక రాతిపైన తొమ్మిదవ శతాబ్దపు నాటి తెలుగు లిపిలో ఉన్న శాసనంలో మొగిలిచర్ల పేరు ప్రస్తావించబడ్డది. అదే లిపిలో వీరగల్లు మీద చెక్కబడివున్న రాతిపై శాసనం ఉంది. కాసె సర్వప్ప రచించిన సిద్దేశ్వరచరితములో కాకతి రుద్రదేవుడు (క్రీ.శ.1042 నుంచి 1130) మహాశక్తికి గుడి కట్టించి నట్లు చెప్పబడ్డది.
మైలారుదేవరకు, వొడ్డెపల్లి వినాయకదేవరకు, మొగిలిచర్ల వద్ద ఏకవీరాదేవికి గుడులు కట్టించి ప్రతిష్టలు చేయించినట్లు ఏకామ్రనాధుడు ప్రతాపరుద్రచరిత్రములో తెలిపాడు. సిద్దేశ్వరచరిత్రములో రుద్రమదేవి మొగినేకదేవియైన ఏకవీరాదేవిని పూజించడానికి ఐదు దినాలు గడిపినట్లు రాసి ఉంది. ఏకామ్రనాధుడు ప్రతాపచరిత్రలో కూడా ఇదే చెప్పబడి ఉంది”.
(దెందుకూరి విద్యానాథ్, వరంగల్)
మొగిలి చెరువు అనే ఊరు మొగిలిచెర్లయింది. అట్ల చెప్పటానికి మొగిలిచెర్లలో చెరువుగట్టు పోచమ్మగుడి దగ్గర ఉన్న వీరగల్లుల మీద శాసనాల ఆధారాలు ఉన్నాయి. వరంగల్ శాసనసంపుటిలో 122,123 సంఖ్యల శాసనాలు మొగిలిచర్లవే. శృంగేరిమఠం నాలుగవ పీఠాధిపతి విద్యారణ్యస్వామి జన్మస్థలం మొగిలిచెర్లే. ఊరికి ఆగ్నేయంగా పొలాల్లో శిథిలస్థితిలో ఉంది ఏకవీర దేవాలయం. ‘కాకతమ్మకు సైదోడు ఏకవీర’ అన్నారు. కాని గుడిలో ఏకవీర విగ్రహం లేదు. రాణి రుద్రమ కొలిచిందన్న బంగారు ఏకవీర ప్రతిమ ఏమైందో. పెద్ద రాతి విగ్రహం పడి ఉండేదట గుడి మంటపంలో. అది కూడా లేదిప్పుడు. స్థానికులు ఈ గుడిని ఎల్లమ్మగుడిగా పిలుచుకుంటారు.
గర్భగుడిలో చాలా విగ్రహాలు పెట్టినట్లున్నారు. వాటిలో ఒకటి ఎల్లమ్మ విగ్రహాం కావాలి. బట్టకప్పడం వల్ల దేవత శిల్పం వివరంగా కనపడలేదు. (ఎల్లమ్మగుడిలో కుండలాలు, కంఠాభరణాలు, దండకడియాలతో వీరాసనంలో కూర్చుని ఉన్న శిల్పముంది. నడుముకు కింది భాగాన వస్త్రం చెక్కబడి ఉంది. కుడి ముంజేత ఖడ్గం, వెనుక కుడిచేత ఢమరుకం, ఎడమ ముంజేత పానపాత్ర, వెనుక ఎడమ చేత త్రిశూలం చెక్కబడి ఉన్నాయి. దెందుకూరి విద్యానాథ్.) గర్భగుడి, అంతరాళాలు చిన్న గదులుగా, 28 స్తంభాలతో, విశాలమైన అర్ధమంటపంతో కూడిన దేవాలయం ఇది. గర్భగుడిపైన విమానం లేదు.
రంగమంటపం పైన అవశేషాలు మిగిలిన ఇటుకల విమానమొకటి కనిపిస్తున్నది. హిందూ దేవాలయాలవలె తూర్పు, ఉత్తర ముఖద్వారాలతో కాక పశ్చిమాభిముఖంగా ఉంది ఈ గుడి. గర్భాలయ ద్వారపాలకులు కనిపించరు. అంతరాళద్వార మొకటి కొంత పూర్వ కాకతీయ లేదా చాళుక్యశైలిలో కనిపిస్తున్నది. రంగమంటపం లోకప్పుకు అష్టదళపద్మం, అష్టభుజకోణాల మధ్య చెక్కబడి ఉంది. దేవాలయాలనికి ముందర 20 అడుగుల దూరంలో ఉన్న ఇసుకరాతి గుండ్లను తొలిచి చేసిన గుహలున్నాయి. ఈ రెండు గుహలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. రెండింటిలోను పానవట్టాలు, లింగప్రతిష్ట కొరకు తొలిచిన గుంటలున్నాయి.
ఒకదానిలో రాతి అరుగునే పానవట్టంగా మార్చి లింగప్రతిష్ట చేసినట్లుంది. అయితే సోమసూత్రం దక్షిణాభిముఖంగా ఉంది. గుడికి వాయవ్యంలో ఉన్న చిన్నరాతిగుండ్ల మీద భైరవరూపాలను తొలవడానికి చేసిన ప్రయత్నాలు కనిపిస్తాయి. ఒక భైరవవిగ్రహం అద్భుతంగా ఉంది. ఆ రెండు రాతి గుహలు వాటి నడుమ మరొక గుండుకు తొలిచిన అర్ధ శిల్పమంటపాలు దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి. వాటిలో ఉండాల్సిన జైన శిల్పాలు లేవు. ఆ గుహలు రెండు జైనమునుల సల్లేఖన గుహలో, ధ్యానమందిరాలో కావాలె. అద్భుతమైన నాగశిల్పం ఒకటి గుడిముందర ఉంది.
గ్రామ ప్రజలందరి దాహం తీర్చిన ఎల్లమ్మబావి శిథిలమై ఉందిప్పుడు. దేవాలయ నిర్మాణం, స్తంభాలు, అర్ధమంటపం, దేవాలయ ద్వారదిశలు.. ఈ గుడి కాకతీయులు కాదు చాళుక్యులో అంతకు ముందరిపాలకులు రాష్ట్రకూటులో కట్టించి ఉండాలి. కాకతీయులకాలంలో మార్పులు జరిగి ఉండాలి. “అక్కడికి దగ్గరలో ఉన్న బావి పక్కన నేలలో పూడిపోయి ఉన్న దేవతామూర్తి శిల్పముంది. దేవత చేతుల్లో ఒక పడగవిప్పిన నాగు, ఒక పాత్ర ధరించి ఉంది. ఎడమ చేతి కింద రెండు పాములు, కుడి పాదం పక్కన మరొక నాగు చెక్కి ఉన్నాయి. వీటిని బట్టి ఆమె విషహరిణియైన మానసాదేవి విగ్రహం లేదా మంత్రసిద్ధురాలి ప్రతిమ అయి ఉంటుంది”.
(దెందుకూరి విద్యానాథ్)
ఈ దేవత మాతంగి. అరుదైన శిల్పం. ఇప్పటికి అక్కడక్కడ కులాచారంగా మాతంగినులు కనిపిస్తారు. తొలుత జైనులైన కాకతీయపాలకులు శైవులుగా మారడంతో ఎన్నో జైన దేవాలయాలు శైవాలయాలుగా మార్చబడ్డాయి. చాళుక్యుల కాలంలో కూడా అంతే జరిగింది. పెద్ద ఉదాహరణ కొలనుపాకలోని పూర్వపు 24 మంది తీర్థంకరుల బసదులన్నీ నేడు మనకు అష్టాదశకులాలు మఠాలుగా కనిపిస్తున్నాయి. ఆ గుళ్లలో కప్పుల్లో, గోడల్లో జైన శాసనస్తంభాలు, శిల్పాలు, అధిష్టానపీఠాలు ఎన్నో కనిపిస్తున్నాయి. రాష్ట్రకూటుల రాజప్రతినిధిగా కొలనుపాక నాడును పాలించిన శంకరగండరస ఏలుబడిలో అరుమకొండ విషయం, నల్లగొండ ప్రాంతం ఉండేవి.
హన్మకొండ దగ్గరి వేల్పుగొండ (జాఫర్ గఢ్)లో, చేర్యాల దగ్గరి ఆకునూరులో, వలిగొండ దగ్గరి ఇంద్రపాలనగరంలో, నల్లగొండ దగ్గరి ఆమనగల్లులో (క్రీ.శ.888) శంకరగండరస పేరు మీద నాలుగు శాసనాలున్నాయి. ఈ శంకకరగండరసనే జైనుల చేత శంకరరాజుగా పిలువబడినట్లున్నాడు. కొలనుపాకలోని మాణిక్యేశ్వరుడు లేదా ఆదినాథ్‌ను శంకరరాజే (పురాణపురుషుడు క్రీ.పూ.680లోనే) ప్రతిష్టించినట్లు జైనులు చెప్తుంటారు. చారిత్రక ఆధారాలతోనైతే ఈశంకరగండరసనే ఆ రాజై ఉంటాడనిపిస్తుంది. ఇప్పుడు మనం జైనదేవాలయంలో చూస్తున్న విగ్రహాలు 10వ శతాబ్దానివని చరిత్రకారుల నిర్థారించారు.
అందువల్ల ధ్వానాసన భంగిమలోనున్న రుషభ్ నాథ్, మహావీరుల రెండు విగ్రహాలు తప్ప కాయోత్సర్గ భంగిమలో ఉన్నాయి. మిగిలినవి 10వ శతాబ్దంలోనే చెక్కినవై ఉంటాయి. ఇప్పటి జైనాలయరూపం వందేళ్ళకింద ఇట్లుండేది కాదని, ఇప్పటి గుడిముందరి ప్రదేశంలో మౌర్యకాలం నాటి, శాతవాహనుల కాలంనాటి ఇటుకలు దొరికినట్లు కూడా నిజాంపాలనలో ఏర్పాటైన పురావస్తుశాఖ అధికార టి.శ్రీనివాస్ నివేదికలో రాయబడి ఉంది. అంతేకాదు, దేవాలయపు గోడల్లో దొరికిన మేఘనంది శాసనం గురించి చరిత్రకారుడు జవహర్ లాల్ భారతిలో రాసిండు. అంటే జైనదేవాలయ నిర్మాణ సమయంలో ఈ శాసనస్తంభం దాని ప్రాకారంలో ఎవరో చేర్చి ఉంటారు.
మొగిలిచెర్ల కూడా ఒకప్పటి జైన స్థానమేనని చెప్పడానికి ఆధారాలింకా అక్కడ దొరుకుతున్నాయి. ఏకవీర గుడి ముందర జైన కలశం చెక్కివున్న కుడి ద్వారం శేరె ఉంది. గ్రామంలోని వేణుగోపాల స్వామి ప్రధాన ద్వారం కూడా పశ్చిమాభి ముఖంగానే ఉంది. లోపల దేవుని ముఖ ద్వారం ఉత్తర దిశలో ఏర్పాటు చేయబడి ఉంది. ప్రధాన ద్వారానికి ఎడమవైపు గోడలో తాపడం చేసిన వినాయక సహిత సప్తమాతృకల అర్థశిల్పఫలకం, భైరవ శిల్ప ఫలకాలున్నాయి. ఇవి శైవశిల్పాలు అంటే పూర్వమిది శైవాలయమై ఉండాలి. ఇంకా అంతకన్నా విశేషమేమిటంటే ప్రధాన ద్వారం కుడిశేరెకు లోపలిదిక్కు కలశం చెక్కి ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి కలశరూపం. జైన నిర్మాణమనడానికి మిగిలిన అవశేషం.
మొగిలిచెర్ల పాఠశాల ఆవరణంలో వేటదృశ్యం చెక్కి ఉన్న రాతి ఫలకం ఒకటి కనిపించింది. రెండు వేటకుక్కలతో ఇద్దరు వేటగాండ్లు ఒకరు గుర్రం మీద రాజాహార్యంతో చేతిలో ఈటెతో, నేలమీదున్న భటుడు బరిశెతో పందిని వేటాడుతున్నట్టున్నది.
బడికి తూర్పు ఈశాన్యంలో ఉన్న శివాలయం ప్రవేశద్వారం పశ్చిమాభిముఖంగాను, గర్భాలయద్వారం దక్షిణాభిముఖంగాను ఉన్నాయి. గుడి మీద ఏడుమెట్ల పిరమిడ్ రూపంలో కట్టిన ఫంసానశైలి విమానం ఉంది. దేవాలయ నిర్మాణమంత రాష్ట్రకూటులశైలిలో ఉంది. కీర్తి ముఖాలు వారి కాలానివే. దేవాలయపు గోడల్లో రాతిస్తంభాలశైలి రాష్ట్రకూటుల కాలం నాటిదే. దేవాలయం ఎత్తు చాలా తక్కువగా ఉంది. దేవాలయం చుట్టు చూరు అంచుల్లో ఏనుగులు, జింకలు, మొసళ్లు, పక్షులు, పూల తీగెలవంటి డిజైన్లు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పక్షులవ్యాలీలు, డిజైన్లు యాదగిరిగుట్ట దగ్గరి చొల్లేరు శివాలయం మీద, పెంబర్తి సమీపంలోని సిద్ధంకి గుట్ట శివాలయం మీద, కొలనుపాక వీరనారాయణాలయం దేవాలయం లోపలి గోడల్లో కనిపిస్తయి.
అవన్నీ రాష్ట్రకూటుల కాలంనాటి నిర్మాణాలే. మొగిలిచెర్ల చెరువుగట్టు అంచున ఉన్న పోచమ్మగుడిలో శిథిలశిల్పాల నడుమ శివపార్వతుల సూక్ష్మశిల్పం (5అంచుల ఎత్తు) ఉంది. గుడిలో ఈశాన్య భాగంలో ఒక శాసన స్తంభం భూమిలో పాతుకునిపోయి ఉంది. అన్ని విగ్రహాలలో ఒక అడుగు ఎత్తున్న పురాతన చాముండి శిల్పం కొంచెం భగ్నం అయి ఉంది. అందులో ఒకటి సూర్యశిల్పం, మరొకటి దోసిలిలో శివలింగంతో శైవ భక్తుని శిల్పం ఉంది. గుడి బయట ఎనిమిది వీరగల్లులున్నాయి. ఆ వీరగల్లులన్నీ ఒకేచోట ఉండడం వల్ల ఈ చోటు ఒకప్పటి వీరభూమి అనిపిస్తున్నది.
ఈ వీరగల్లులు వీరులు యుద్ధంలో, గ్రామరక్షణలో బలయిపోయినప్పుడు వారి స్మారకంగా వేసినవి. వీరుడు పోరులో అమరుడవడం, దివ్యలోకాలకు చేరడం, దేవతామూర్తుల ఆదరణ 2,3 అంతస్తులలో శిల్పాలతో ఉన్నవి కొన్ని. వీరులే ఉన్న శిల్పాల ఫలకాలు కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చక్కని శిల్పంతో ఉన్న ఒక వీరగల్లును రామునిశిల్పంగా పిలువడం ఆశ్చర్యంగా ఉంది. ఆ వీరుడు కుడిచేత కైజారును ధరించి, ఎడమ చేత విల్లు, అమ్ములను పట్టుకొని ప్రత్యాలీఢపాదంతో నిలుచున్నట్టు కనపడుతున్న దృశ్యశిల్పమది. విల్లు ధరించిన వీరుల వీరగల్లులను రాముని విగ్రహాలుగా భావించి నిర్మించిన సంఘటనలు చాలా ఉన్నాయి.
యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్న రఘనాథపురంలో ఏకంగా ఒక గ్రానైటు రాతిబోడునే రామస్వామిగుట్ట అని పిలుస్తున్నారు గ్రామస్తులు. ఒకస్వామీజీ 30 యేండ్ల క్రితం అక్కడున్న రెండు వీరగల్లులను రామలక్ష్మణులుగా భావించి మరొక రాతిమీద సీతబొమ్మ గీయించి గుడిలో పెట్టించిండు. పెద్దపల్లి (జిల్లా) దగ్గర కూడా ఒకవీరగల్లును హనుమాండ్లుగా భావించి గుడికట్టిస్తున్న సంఘటన ఈ మధ్యనే తెలిసింది. అయితే ఇక్కడ వరంగల్ జిల్లా శాసనసంపుటిలోని రెండు మొగిలిచెర్ల శాసనాలలో ఒక శాసనం రామునిశిల్పమున్న రాయికే ఉందని రాయడం ఆశ్చర్యకరం. వీరగల్లుల మధ్య సగం విరిగిన శాసన రాతిఫలకం ఉంది. చెక్కి సిద్దపరిచిఉన్న శాసనం లేని ఎర్రరాతి శాసన స్తంభం మరొకటి అక్కడ పాతబడి ఉంది.
ఈ గుడికి దగ్గరలో మూలపోచమ్మ గుడి ఉంది. అందులో చతుర్భుజియైన దుర్గ విగ్రహముంది. మరికొన్ని విగ్రహాలున్నాయి. “గ్రామం మధ్యలో రోడ్డు పక్కన పడి ఉన్న అనేక ప్రతిమల్లో కాకతి, నాగశిల్పాలు, వీరగల్లులు, నందులు, సూర్యవిగ్రహాలు, లక్ష్మినరసింహ శిల్పశకలం, దానిపై దశావతారాలు, గరుడ, ద్వారపాలక రూపాలున్నాయి. ద్వారపాల, భైరవ విగ్రహాలున్నాయి. పాఠశాల ప్రాంగణంలో వేట శిల్ప ఫలకం ఉంది”. (దెందుకూరి విద్యానాథ్)
“కాకతితో పాటు ఏకవీరకు పూజలు గొప్పగా జరుగుతుండేవని, ఏకవీర ఆలయం సైనికాధికారి కట్టించినదని, విశాల ప్రాంగణంలో ఆలయ నిర్మాణం జరిగిందని, మంచి నీటిబావి తవ్వకం చేయబడిందని, ఏకవీరను రుద్రమ క్రమం తప్పక పూజించేదని, యుద్ధ వ్యూహరచనలను ఇక్కడే చేసేదని తెలుస్తున్నది. ఈ గుడి నుంచి ఓరుగల్లుకు రెండు రహస్య సొరంగమార్గాలుండేవని, కాకతీయులు ఏకవీర గుడి ఎదురుగా వున్న రాతిగుండ్లను తొలిచి గదులుగా చేశారని చెప్పబడింది. పట్టాభిషేకం పూర్తయిన పిదప రుద్రమ ఐదు రాత్రులు నిద్రపోకుండా పంచరాత్రవ్రతం చేసిందిక్కడేనట”.
(కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు పోలవరపు హైమవతి)
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, టార్చ్ ప్రధానకార్యదర్శి అరవింద్ ఆర్య పకడే మరియు దక్కన్ క్రానికల్ వరంగల్ జిల్లా (౫ పాత జిల్లాలు) కరస్పాండెంట్ తిరుమళ్ళ అనుదీప్ కలిసి హన్మకొండకు ౬ కి.మీ.ల దూరంలో ఉన్న మొగిలిచెర్ల గ్రామంలోని దేవాలయాల సందర్శన నివేదిక.






