చర్మవాద్యం పంబ
పంజ జంట వాద్యం. రెండు పొడగు డోళ్ళను కలిపి ఒక జోడీగా వీరణం తయారు చేస్తారు. ఒక దానిని చెక్కతో, మరో దానిని ఇత్తడితో తయారు చేస్తారు. వాటికి ఎడమ కుడివైపుల చర్మాన్ని అతికిస్తారు. ఎడమ చేతితో వాయిస్తారు. కుడిచేత్తో పుల్లతో కొడతారు. రెండు పంబలు కలిపి ఒక వాద్యంగా ఉంటుంది. రెండు కలిసి ఒకటిగా జోడుగా ఉంటుంది. కాబట్టి ఈ వాద్యాన్ని పంబజోడు అంటారు.
పంబ వాయించే వారికి సహవాద్యకారులు ఉంటారు. ఒకవైపు శ్రుతివాద్యం, మరోవైపు జమిడిక వాయిస్తారు. వెనక తాళాలు వాయిస్తూ మరొకరు ఉంటారు. ఈ బృందం ఎల్లమ్మ కథా చక్రాన్ని గానం చేస్తారు. వీరికి పంబాలవారు అని పేరు. ఈ ప్రదర్శనలో ప్రధాన వాద్యం జమిడికే అయినా దానిని పంబ కథ అంటారు. ఈ కథను చెప్పే వారిని పంబాలవారు అని పిలుస్తారు.
పంబాలవారు ఎస్సీలలో మాలకులంలో ఒక తెగ కిందకు వస్తారు. గుర్రం వారి లాగే వీరు కూడా మాలల ఉపకులం. బైండ్ల వారు కూడా జమిడిక వాయిస్తారు. వారి కథలకు బైండ్ల కథలు అని పేరు. మాల, మాదిగలు చెప్పే కథ ఎల్లమ్మ కథా చక్రమే.
వీరు పూజారులు, గురువులు. చావులప్పుడు క్రియలు కూడా చేస్తారు. మైల తీస్తారు. ‘పట్నాలు’ (ముగ్గులు) వేస్తారు. ఎల్లమ్మ, భూలక్ష్మి, ఈదమ్మ, మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతల కథలు చెబుతారు. పంబ తదితర వాద్యాల చప్పుడు, వాదన ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వాద్యం మోగుతున్నంత సేపు ఒకరమైన గంభీర వాతావరణం సృష్టింపబడుతుంది.
మూలధ్వని పుస్తకం నుంచి..






