3 May, 2026 | 8:38 PM

ముగిసిన మహాక్రతువు

02-06-2024 12:05 AM

లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసింది. ఏడు దశలుగా సాగిన పోలింగ్ ప్రక్రియలో భాగంగా శనివారం చివరి దశలో 8 రాష్ట్రాలు, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగియడంతో దేశంలోని మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్తరాదిన మండిపోతున్న ఎండలు, వడగాడ్పుల కారణంగా చివరి విడతలో పోలింగ్ అంతకు ముందు ఆరు విడతలతో పోలిస్తే కాస్త తక్కువగా నమోదయింది. సుదీర్ఘంగా 41 రోజులపాటు సాగిన పోలింగ్ ప్రక్రియలో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా ముగిసినందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభినందించి తీరాలి. ఎందుకంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఈ లోక్‌సభ ఎన్నికల్లో 90 కోట్ల మందికిపైగా ఓటర్లు పాల్గొన్నారు. లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది, పోలీసులు, పారా మిలిటరీ బలగాలు పాల్గొన్న ఈ భారీ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఈసీ ఎంతో కసరత్తు చేసింది.

రాష్ట్రాల్లోని ఉద్యోగులు, పోలీసుల సహకారంతోపాటు పెద్ద సంఖ్యలో పారా మిలటరీ బలగాల తోడ్పాటుతో నిర్విఘ్నంగా ఈ మహాక్రతువును ముగించింది. పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసేలోగా మండే ఎండలు, తుపాను బీభత్సం ఇలా ఎన్నో ప్రకృతి అవాంతరాలు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించింది. మంగళవారం ఓట్ల లెక్కింపు పూర్తయి, ఏ  కూటమి విజేతగా నిలుస్తుందో తేలిన తర్వాత కొద్దిరోజుల్లోనే ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. దీంతో ఈసీ బాధ్యత పూర్తవుతుంది. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గత ఎన్నికలకు భిన్నమైన ధోరణి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండీ’ కూటమి తమకు పోటీయే కాదని మోడీ నేతృత్వంలో 400కు పైగా సీట్లు దక్కించుకుని ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంటామన్న ధీమాతో అధికార బీజేపీ కనిపించింది. అయితే, తొలి దశ పోలింగ్ ముగిసాక కమలనాథుల స్వరం మారింది.

ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు స్థానికంగా తమకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపించడంతో ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడికి దిగింది. ప్రధాని నరేంద్ర మోడీకూడా ఇందుకు  భిన్నం కాలేదు. రాహుల్‌గాంధీతో మొదలుపెట్టిన వ్యక్తిగత విమర్శలు చివరికి ఆ పార్టీ మాజీ ప్రధానుల దాకా సాగాయి. ఇవన్నీ చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సైతం మోడీ ప్రసంగాల తీరును తప్పు బట్టడం గమనార్హం. అంతేకాదు, బీజేపీ నేతలంతా మోడీని మరోసారి గద్దె నెక్కించడానికి ఓటేయమని అడిగితే, మోడీ దేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించకుండా ముస్లింల రిజర్వేషన్లు, మంగళసూత్రాలు, రాజ్యాంగం లాంటి వివాదాస్పద అంశాలను తెరమీదికి తెచ్చి జనంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. దీనివల్ల అధికార బీజేపీకి ఓట్ల పరంగా లబ్ధి చేకూరవచ్చునేమో కానీ దేశానికి మాత్రం హితం కాదు.

ఇక, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మొదట్లో తానే పెద్దన్నగా ఉండాలన్న ధోరణితో వ్యవహరించడంతో కూటమి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. వెంటనే అంతకు ముందు చేసిన తప్పులను సరిదిద్దుకొని మిగతా భాగస్వామ్య పక్షాలతో సర్దుకు పోవడానికి సిద్ధపడ్డం కూటమి ఎన్నికల్లో బలంగా పోరాడడానికి వీలు కల్గించింది. మేనిఫెస్టోలోనూ ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీల మనోభావాలకు సముచిత స్థానం కల్పిస్తూ, జాతీయ సమస్యలకూ ప్రాధాన్యమిచ్చింది. ఫలితంగా  ప్రచారం ప్రారంభంలో వెనుకబడినట్లుగా కనిపించిన ప్రతిపక్షాలు ఆ తర్వాత పుంజుకొని అధికార బీజేపీకి గట్టి సవాలు విసరగలిగాయి. తద్వారా ఈ ఎన్నికల్లో అధికారం దక్కించుకోకపోయినా బలమైన ప్రతిపక్షంగా నిలువబోతోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొనేందుకు అవసరమైన శక్తియుక్తులను సమకూర్చుకునేందుకు వీలు కలిగింది.