17 April, 2026 | 2:15 AM

ఉన్నట్టా..! లేనట్టా..!!

17-04-2026 12:00 AM
  1. రోళ్లపాడు జలాశయం శంకుస్థావనకు పదేళ్లు పూర్తి
  2. పురోగతికి రాని పనులు

ఇల్లెందు/టేకులపల్లి, ఏప్రిల్ 16,(విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామా ప్రాజెక్టు రోళ్లపాడు జలాశయానికి శంకుస్థాపన చేసి ఈ ఏడా ఫిబ్రవరి నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల సాగు భూమికి నీరివ్వాలన్న లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం పూర్వ బేతంపూడి పంచాయతీ పరిధిలోని ప్రస్తుత రోళ్లపాడు పంచాయతీలో రోళ్లపాడు ప్రాజెక్టును జలాశయంగా మార్చుతూ 2016 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వయంగా శంకుస్థాపన చేశారు.

గోదావరి నదీ జలాలను తరలించి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోని సాగు భూములకు నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. లక్ష్యం భాగానే ఉన్నా ఆశయం ఇంకా నెరవేర లేదు. ఇప్పటి వరకు సర్వేలు కొనసా..గుతూనే ఉన్నాయి. రోళ్లపాడు జలాశయంలో 20 టీఎంసీల నీరు నిలకడగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం వల్ల పూర్వ బేతంపూడి పంచాయతీ పరిధిలోని రోళ్లపాడు, రుక్మాతండా, బీల్యాతండా గ్రామాలు పూర్తిగా మునగనున్నాయని నిర్ణయించారు.

అవే కాకుండా రెండు వేలకు పైగా సాగు భూములు, పోడు భూములు నీట మునగనున్నాయన్నారు. వారి కోసం ముందస్తుగా వేరే ప్రాంతంలో భూములు సేకరించి గ్రామాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆరేళ్ల పాటు సర్వేలు చేయించింది. మండల పరిధిలోని సాయనపేట సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో మూడు గ్రామాలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని పరిశీలనలకే పరిమితం ఐంది.

వారికి అడిగిన ప్యాకేజీ ఇస్తామని శంకుస్థాపన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా భరోసా ఇచ్చారు. అయినా అధికారులు మాత్రం భూసేకరణ చేయడంలో వెనుకంజ వేయడంతో దీనితో ఆ ప్రాజెక్టు జలాశయం ఉన్నట్టా.. లేనట్టా అన్న మీమాంస మొదలైంది.

గ్రావిటీతోనే నీటి తరలింపు..

గోదావరి నుంచి మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పైపుల ద్వారా నీటిని తరలించేందుకు గోదావరి నుంచి టేకులపల్లి మండలం రోళ్లపాడు వరకు పైపులు పరిచారు. వాటి ద్వారా నీటి తరలింపు కష్టమని ప్రభుత్వం నిర్ణయించి గ్రావిటీ ద్వారానే నీటిని తరలించేందుకు నిర్ణయించి పరిచిన పైపుల్ని తొలగించి వేరే ప్రాంతానికి తరలించారు. గోదావరి నుంచి రోళ్లపాడు జలాశయం వరకు మూడు స్టేజీల్లో పనులు చేపట్టేందుకు నిర్ణయించి మొదటి దశకు భూసేకరణ పూర్తి చేసి పనులు కూడా కొంత మేర పూర్తి చేసినట్లు సమాచారం.

ఆ దశకు అటవీ అనుమతులు కూడా రావడంతో అక్కడి పనులు చేపట్టేందుకు వేగవంతం చేశారు. మరో దశలో కూడా భూసేకరణ పూర్తయినట్లు తెలిసింది. వాటితో పాటే మూడో దశలో కూడా చేపట్టి త్వరగా పనులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి తొలిదశ అవసరైన 1,531.05 హెక్టార్ల భూమి బదలాయింపుకు అటవీశాఖ నుంచి సానుకూలత లభించింది.

ఈ భూములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు డివిజన్లో 212.55 హెక్టా ర్లు, పాల్వంచలో 618.95 హెక్టార్లు, కొత్తగూడెం డివిజన్లో 369.09హెక్టార్లు, ఖమ్మం పరిధి సత్తుపల్లి డివిజన్లో 277.40 హెక్టార్లు, ఖమ్మం డివిజన్లో 52.64 హెక్టార్ల అటవీ భూమి ఉందని గుర్తించినట్లు తెలిసింది. దీనితో సీతారామ ఎత్తిపోతల పథకంలో కాలువలు, టన్నెళ్లు, విద్యుత్తు లైన్లు నిర్మించడానికి వినియోగించనున్నారనుకున్నారు. 

జలాశయం స్థానంలో కొద్దిపాటి నీటి నిల్వకే అనుకూలత..?

రోళ్లపాడు ప్రాజెక్టును 20 టీఎంసీల సామర్థ్యం కల జలాశయం నిర్మించాలని మొదట తలచినా, తర్వాత డిజైన్ మార్చినట్లు తెలుస్తుంది. దీనితో గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని రోళ్లపాడు ప్రాజెక్టులో నిల్వచేసి, ఇల్లెందు, బయ్యారం, ఇతర ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా తరలిస్తారంటున్నారు. వాస్తవ పరిస్థితి తెలియక స్థానికులు మాత్రం పదేళ్లు గడిచినా ఇంకా మోక్షం లేదంటూ వాపోతున్నారు. అటు పరిచిన పైపులు తీసేసి, ఇటు గ్రావిటీ ద్వారా తరలించే కాల్వలు కూడా తవ్వక పోవడంతో అసలు ప్రాజెక్టు ఉన్నదా లేదా అన్న మీమాంసలో ప్రజలు ఉన్నారు.