ఉగ్రవాదం ప్రపంచశాంతికే ముప్పు
- ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలి
ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీ పిలుపు
హమాస్ కిరాతక దాడిని ఖండించిన భారత ప్రధాని
ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశా అడుగులు
గాజా శాంతి చొరవకు మద్దతిస్తామన్న మోదీ
మోదీ గొప్ప నాయకుడు.. భారత్ గొప్ప శక్తి: నెతన్యాహు
జరూసెలేం, ఫిబ్రవరి 25: ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా అది ప్రపంచ శాంతికే ముప్పు అని, దానిపై రాజీలేని పోరాటం చేయాలని ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఆ దేశ టెల్ అవీవ్ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మోదీ గౌరవార్థం విమానాశ్రయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ధరించిన కుర్తాపై ఉన్న కేసరి రంగు పాకెట్ స్క్వేర్ అందరినీ ఆకర్షించింది. సారా నెతన్యాహు కూడా అదే రంగు దుస్తులు ధరించారు. దీనిని చూసిన నెతన్యాహు ఇది ‘కేసరి అనుబంధం’ అని సరదాగా వ్యాఖ్యానించారు. మోదీ అద్భుతమైన నాయకుడని ఆయన ప్రశంసించారు.
అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంటు (క్నెసెట్)లో మోదీ చారిత్రాత్మక ప్రసంగం చేస్తూ.. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా, అది అన్ని చోట్లా శాంతికి ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఈ కష్టసమయంలో భారత్ పూర్తి దృఢ నిశ్చయంతో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
26/11 ముంబై దాడుల సమయంలో భారత్ అనుభవించిన వేదనను, ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్ పౌరులను ఈ సందర్భంగా మోదీ స్మరించుకున్నారు. ఏ కారణం కూడా పౌరుల హత్యను లేదా ఉగ్రవాదాన్ని సమర్థించలేదని మోదీ ఉద్ఘాటించారు. తన ప్రసంగంలో మోదీ భారత్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ, భారత్‌లో యూదు సమాజం ఎప్పుడూ వివక్షకు గురికాకుండా, పూర్తి స్వేచ్ఛతో జీవిస్తోందని పేర్కొన్నారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే గాజా శాంతి చొరవకు భారత్ మద్దతు ఇస్తుందని, చర్చలు, స్థిరత్వం ద్వారానే ఈ ప్రాంతంలో శాంతి సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ నీటి వినియోగంపై, వ్యవసాయ తీరుతెన్నులపై ప్రపంచమంతా విస్తుపోతోందని, ఈ దేశంలో ఎక్కడ చూసినా యోగా మంత్రమైందని మోదీ అన్నారు.
అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంటు ప్రధాని మోదీకి తమ అత్యున్నత పురస్కారమైన ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేసింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ కనబరిచిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
మోదీ గొప్ప నాయకుడు.. భారత్ గొప్ప శక్తి: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ప్రసంగంలో ప్రధాని మోదీని ప్రపంచ వేదికపై ఒక గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. 150 కోట్ల జనాభా కలిగిన భారత్ ఒక గొప్ప శక్తి అని, ఇజ్రాయెల్ చిన్న దేశమైనా తన శక్తిలో ఏమాత్రం తక్కువ కాదని ఆయన అన్నారు. భారత్- ఇజ్రాయెల్ మధ్య ఉన్న కూటమి ఇరు దేశాల శక్తిని రెట్టింపు చేస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు. మోదీ ఇచ్చే ఆలింగనం (మోదీ హగ్) ఎంతో ప్రత్యేకమైనదని, అది కేవలం లాంఛనం కాదని, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న ఆత్మీయతకు అది నిదర్శనమని ఆయన కొనియాడారు.
కష్టకాలంలో ఇజ్రాయెల్ పక్కన నిలబడినందుకు, సత్యం వైపు నిలిచినందుకు నెతన్యాహు మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై దేశీయంగా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, పవన్ ఖేరా మోదీపై విమర్శలు చేస్తూ, అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి దృష్టి మరల్చడానికే ఆయన ఇజ్రాయెల్ వెళ్లారని ఆరోపించారు. పాలస్తీనా విషయంలో భారత్ అనుసరిస్తున్న దశాబ్దాల నాటి విదేశీ విధానానికి ఈ పర్యటన వ్యతిరేకమని సీపీఐ(ఎం) విమర్శించింది.




