20 March, 2026 | 3:50 PM

నవ వసంత ఆగమనం

19-03-2026 12:00 AM

శిశిరం అవనతమై 

వసంతం రెపరెపలాడితే

శ్రీపరాభవ విజయం చేసినట్టే

తొలి పండుగ తరలి వచ్చి

తెలుగువాళ్ల ఆనందం 

అవధులు తెంపినట్టే 

చైత్రశుద్ధ పాడ్యమి కళ

నూతన వత్సర శుభ మంగళం 

ఉగాది కళకళల ఆగమనం

దినకరుడివదనం 

కోపం తాపం 

నవ్వులు పూసే వేప 

అమలిన మాధుర్యమైన

కోయిల స్వరం

పలకరించే పచ్చి మామిడి

కాలం కట్టిన

కొత్త చీరెలో 

పచ్చగా మెరిసే ఆశల రంగులు

భవిత పంచాంగ శ్రవణానందమైతే 

పంటి పంటిన నలిగే 

షడ్రుచుల పచ్చడి

జిహ్వకో రుచి కాదు 

ఆరు రుచులూ

సంగమిస్తేనే ఔషధం 

అసలు జీవితం 

అదే అంటోంది

మనసుకు మామిడి తోరణం కట్టి

బతుకు ముంగిట

ముత్యాల ముగ్గులు అల్లి

నూతన వస్త్రాలు చుట్టి 

ఆశీర్వచనాలతో అక్షతలు చల్లి 

దీవించి వెళ్లేదే మన ఉగాది!