తెలంగాణ సినిమా పాలసీ తేవాలి!
హైదరాబాద్ కేంద్రంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేడు వటవృక్షంలా విస్తరించింది. ‘పాన్ ఇండియా’ స్థాయికి ఎదిగి, వేల కోట్ల వసూళ్ల తో ప్రపంచ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతుండటం గర్వించదగ్గ విషయమే. అయితే, ఈ భారీ వృక్షం నీడన తెలంగాణ ‘ప్రాంతీయ సినిమా’ అస్తిత్వం ఏది? అన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న అసలైన ప్రశ్న. కేవ లం ఒక యాసకో, ఒక పాటకో పరిమితం కాకుండా, తెలంగాణ మట్టి వాసనను, ఇక్కడి జీవన సంస్కృతిని ప్రతిబింబించే ఒక ప్రత్యేక సినిమా పాయ అవసరమని కాలం బలంగా కోరుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే, సాహిత్యం, సంస్కృతికి కొనసాగింపుగానే కళారూపాలు పుడతా యి. బెంగాలీ, మలయాళం లేదా మరాఠీ సినిమాలను గమనిస్తే.. అక్కడి మట్టి కథలే వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. తెలంగాణకు ఘనమైన పోరాట చరిత్ర, సుసంపన్నమైన సాహిత్యం, వైవిధ్యమైన సంస్కృతి ఉన్నాయి. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘దక్కనీ సినిమా’ కాలక్రమేణా కనుమరుగైపోయింది.
ఇప్పుడు తెలంగాణ సినిమా కూడా అదే దారి పట్టకూడదంటే, కేవలం భాషా పరిజ్ఞానంతోనే కాకుం డా, పక్కా ‘తెలంగాణ సోయి’తో కూడిన కథ లు రావాలి. అందుకోసం ప్రభుత్వం వెంటనే తెలంగాణ సినిమా పాలసీని రూపొందించాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్ కు తరలిరావడం వెనుక నాటి ప్రభుత్వం కల్పించిన భూములు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఉన్నాయి.
అయితే, ఆ సమయంలో పరిశ్రమలో తెలంగాణ వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంతో, ఇక్కడి వారికి అవకాశాలు పరిమితమయ్యాయి. పరిశ్రమ ఇక్కడ స్థిరపడిన తర్వాత కాలక్రమేణా రాయితీలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణ నుంచి నిర్మాతలు, దర్శకులు రావాలంటే మళ్లీ అలాం టి ప్రత్యేక ప్రోత్సాహకాలు అం దించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉనికిలో ఉన్నప్పటికీ, అది కేవలం అవార్డుల ప్రదానానికో లేదా నామమాత్రపు కార్యక్రమాలకో పరిమితమవు తోందనే విమర్శ ఉంది.
వాగ్గేయ కారుడు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వ డం మంచిదే, కానీ తెలంగాణ సినిమా మనుగడకు అది మాత్రమే సరిపోదు. కమర్షియల్ తెలుగు సినిమా వెల్లువను తట్టుకుని తెలంగాణ చిన్న సినిమాలు నిలబడాలంటే ప్రభుత్వం తక్షణం ‘తెలంగాణ ఫిల్మ్ పాలసీ’ని ప్రకటించాలి. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం ప్రభుత్వం కింది అంశాలతో కూడిన సమగ్ర విధానాన్ని రూపొందించాలి. తెలంగాణ నేపథ్యంతో సినిమా తీసే నిర్మాతలకు పన్ను మినహాయింపులు, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించేలా నిబంధనలు ఉండాలి.
చిన్న సినిమాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతీయ సినిమాలకు థియేటర్లలో ప్రదర్శన అవకాశాలు కల్పించే రక్షణ కవచం ఉండాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే కథలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎవరితోనూ ‘పంచాయితీ’ అవసరం లేదు. ఇప్పటికే స్థిరపడిన టాలీవుడ్ తన పని తాను చేసుకుపోతుంది.
కానీ, దానిలో తెలంగాణ సినిమా ఒక అంతర్లీన పాయగా కాకుండా, తనదైన ప్రత్యేక అస్తిత్వంతో ఎదగాలి. మన భాష, మన బతుకు చిత్రం వెండితెరపై ఆవిష్కృతమవ్వాలి. తెలంగాణ సినిమా పాలసీ తీసుకొచ్చి, ప్రభు త్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తేనే, తెలంగాణ సినిమా అస్తిత్వ పోరాటం నుంచి విజయవంతమైన పరిశ్రమగా ఆవిర్భవిస్తుంది.
సీనియర్ జర్నలిస్ట్, సెల్: 97017 03684




