బైకుకు నిప్పంటించిన దుండగుడు
హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని వెల్లంపల్లి గ్రామంలో ఇంటి ముందు పార్క్ చేసిన ఓ వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెల్లంపల్లి గ్రామానికి చెందిన పూరెల్ల ప్రవీణ్ అనే యువకుడు గురువారం రాత్రి ఎప్పటిలాగే తన బైకును ఇంటి ముందు పార్క్ చేశాడు.
అయితే, రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ దగ్గరి బంధువు ఒకరు అతని బైకుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలను గమనించిన ప్రవీణ్ వెంటనే బయటకు రాగా, నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితుడు వెంటనే మంటలను ఆర్పడంతో పెను తప్పిపోయింది. తన బైకును కావాలనే దగ్ధం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు ప్రవీణ్ పోలీసులను కోరుతున్నాడు.






