6 April, 2026 | 11:50 PM

కూర్గ్ అందాలు!

02-12-2024 12:00 AM

అదొక అందమైన పొదరిల్లు.. ప్రశాంతమైన వాతావరణం.. అందమైన జలపాతాలు.. దట్టమైన అడవులు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటు చూసినా పచ్చని చెట్లు.. దారివెంట పక్షుల కిలకిల రావాలు.. కాఫీ తోటల పరిమళాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి.. అదే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కూర్గ్ (కొడవ జిల్లా). గజిబిజి లైఫ్ నుంచి ప్రశాంతతను కోరుకునే వారు ఇక్కడికి వచ్చి మూడు, నాలుగు రోజులు సేదతీరవచ్చు. కూర్గ్‌లో చూడాల్సిన ప్రదేశాలేంటో తెలుసుకుందాం..  

కర్నాటకలో ఉన్న ఈ ప్లేస్ కాఫీ తోటలకు ఫేమస్. మనదేశంలో కాఫీ ఎక్కువగా పండించేది ఇక్కడే. కూర్గ్‌ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. కారణం.. స్కాట్లాండ్‌లో ఉన్నట్లే ఇక్కడ కూడా పచ్చదనం, రకరకాల పూల మొక్కలు, చెట్లతో నిండిన అందమైన లోయలు ఉంటాయి. సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడికి వేళ్లేదారంతా.. ఏటవాలుగా కనిపించే కాఫీ తోటలు, వంకర్లు తిరిగిన రోడ్లతో ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

కొండలు, గుట్టలు, పెద్ద చెట్లతో ఆహ్లాదంగా ఉండే కూర్గ్‌లో ట్రెక్కింగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు టూరిస్ట్‌లు. ఇక్కడి కాఫీ తోటల్లో నచ్చినంత సేపు తిరగొచ్చు. సాయంత్రం పూట రకరకాల పక్షుల్ని చూస్తూ హాయిగా గడిపేయొచ్చు. ఇక్కడికి వెళ్లడానికి టూర్ ప్యాకేజీలు ఉంటాయి. రెండు రోజుల టూర్ ప్లాన్ చేసుకుంటే కూర్గ్ మొత్తం చూడొచ్చు. ఈ కొండ ప్రాంతంలో ‘కొడవ’ తెగవాళ్లు నివసిస్తుంటారు.

వీళ్లు ‘కొడవ’ భాష మాట్లాడతారు. వీళ్లంతా యుద్ధవిద్యల్లో ఆరితేరినవాళ్లు. పెండ్లిండ్లు, ఇతర వేడుకల్లో కత్తులు, బల్లెం, బాణాలు, తుపాకుల్ని చేత పట్టుకుంటారు. పూర్వీకులతో పాటు ఆయుధాల్ని పూజిస్తారు. టూరిస్ట్‌లకు ఆతిథ్యం కూడా ఇస్తారు. అంతేకాదు మనదేశంలో లైసెన్స్ లేకుండా తుపాకీ ఉపయోగించేందుకు ఈ తెగ ప్రజలకు అనుమతి ఉంది. 

అబే జలపాతం

కూర్గ్ హిల్ స్టేషన్ దగ్గర్లో ప్రసిద్ధ టిబెటన్ దేవాలయం ‘బైలకుప్పె’ ఉంటుంది. ఇది మనదేశంలోనే రెండో పెద్ద టిబెటన్ గుడి. కావేరీ నది మీద ఉన్న అబే వాటర్ ఫాల్‌ని కూడా చూడొచ్చు. కూర్గ్‌లో చూడాల్సిన మరో ప్లేస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఏనుగులకి మేత వేయొచ్చు. వాటికి స్నానం కూడా చేయించొచ్చు. ఎండాకాలంలో చాలామంది హిల్‌స్టేషన్లలో సేదతీరాలి అనకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే ఎత్తున కొండలు, వాటి మధ్య ప్రవహించే సెలయేర్లు, దూకే జలపాతాలు, పచ్చని చెట్లని చూస్తూ ప్రకృతిని ఆస్వాదించొచ్చు. వీకెండ్‌లో ఇక్కడికి వెళ్లే మనసు నిండా అందమైన జ్ఞాపకాల్ని పోగేసుకుంటారు. 

ఎలా వెళ్లాలంటే?

హైదరాబాద్ నుంచి కూర్గ్ హిల్ స్టేషన్ 806 కి.మీ దూరం ఉంటుంది. ఇక్కడికి ట్రైయిన్, బస్సు, కారులో వెళ్లాలంటే..14 గంటల సమయం పడుతుంది. ప్లయిట్‌లో కూడా కూర్గ్‌కు వెళ్లొచ్చు. కాకపోతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్ పరిమితి, సమయాన్ని బట్టి రవాణా సౌకర్యాలను ఎంచుకోవడం ఉత్తమం.