వరద ముప్పుపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
సారపాక–రెడ్డిపాలెం రహదారిపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
బూర్గంపాడు, (విజయక్రాంతి): గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్(Bhadradri Kothagudem District Collector) అంకిత్ సారపాక–రెడ్డిపాలెం ప్రధాన రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగితే రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైతే వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, ప్రజలు ఎవరూ ఆ మార్గంలో ప్రయాణించకుండా పటిష్ట బందోబస్తు కల్పించాలని పోలీసు, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.కలెక్టర్ వెంట తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఎస్‌ఐ నాగభిక్షం తదితర అధికారులు పాల్గొన్నారు.






