అరవైలో అందంగా..!
యవ్వనంగా కనిపించాలనే ప్రతిఒక్కరు కోరుకుంటారు. కానీ వయసు పెరిగేకొద్దీ చర్మం, ఎముకలు, వెంట్రుకలు, ఇతర శరీర భాగాలు బలహీనంగా మారి వృద్ధాప్య ఛాయలు ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే రోజువారి జీవితంలో కొన్ని అలవాట్లను పాటిస్తే చర్మ ముడతలు తగ్గించడంతోపాటు అందంగా, యవ్వనంగా కనిపించవచ్చు. అవి ఏమిటో తెలుసా..-
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం లేదా చక్కెర అధికంగా ఉన్నవి తింటుంటే.. వృద్ధాప్యం త్వరగా వస్తుంది. అందుకే వెంటనే వీటికి గుడ్ బై చెప్పండి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు దీర్ఘకాలంలో మెదడు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతాయి. అలాగే తాజా కూరగాయలు, పండ్లు వృద్ధాప్య పురోగతిని నెమ్మదిస్తాయి. వీటిని ఎక్కువగా మీ డైట్‌లో చేర్చుకోవాలి.
బలమైన బంధం
వయస్సు పెరిగేకొద్దీ కొంతమంది ఒంటరితనానికి బాగా అలవాడుతారు. అనారోగ్య సమస్యలు, భాగస్వామి మరణం ఇందుకు కారణాలు కావొచ్చు. అయితే ఒంటరితనం వల్ల మనిషి చురుగ్గా ఉండలేడు. ఏదో కోల్పోయిన భావన వెంటాడుతుంది. కాబట్టి పిల్లలు, ఇతర బంధువులు ఉంటే తరుచుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. మనసులోని బాధలను ఇతరులకు షేర్ చేసుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. బలమైన బంధాలున్న వ్యక్తులు నిత్యం ఆరోగ్యంగా ఉన్నట్లు పలు హెల్త్ సర్వేలు కూడా తేల్చి చెప్పాయి.
రెగ్యులర్ వ్యాయామం
వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. జీవితాంతం వ్యాయామం చేసే వ్యక్తుల్లో మెరుగైన శరీర అభివృద్ధి, తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు, సరైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు. కాబట్టి వృద్ధాప్యానికి చెక్ పెట్టాలంటే వ్యాయామం తప్పనిసరి చేయాలని చెబుతున్నారు నిపుణులు. రెగ్యులర్ వ్యాయాయం ఒత్తిడిని తగ్గిస్తుంది.
విటమిన్ డీ
సూర్యరశ్మి నుండి పొందే విటమిన్ డీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ డి అధిక స్థాయిలో ఉన్నవారికి వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. మెరిసే చర్మ సౌందర్యం వారి సొంతం అవుతుంది. చలికాలంలో చర్మం సాధారణంగా పొడిబారుతుంటుంది. అలాంటప్పుడు లోషన్లు, మంచి నిద్రతో చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.
కంటి నిండా నిద్ర
మారిన జీవన పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తగినంతగా నిద్ర పోవడం లేదు. అయితే ఇలా నిద్ర లేమి ఎక్కవ కాలం కొనసాగితే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎనిమిది గంటలపాటు తప్పనిసరిగా నిద్ర పోవాలని వారు సూచిస్తున్నారు. సరైన నిద్ర కూడా వృద్ధాప్య ఛాయలను అరికడుతుంది.
ధూమపానానికి దూరంగా
చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధూమపానం, మద్యపానం లేదా మందులు వాడతారు. కానీ వీటి అధిక మోతాదు మరణానికి దారితీస్తుంది. అంతేకాదు ప్రతిరోజూ మద్యం సేవించి, పొగతాగుతూ ఉంటే వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కళ్ల కింద చర్మం కుంగిపోవడం ప్రారంభమవుతుంది. ముడతలు త్వరగా కనిపిస్తాయి.




